NANI@42: నాని బర్త్ డే స్పెషల్.. మినిమమ్ గ్యారెంటీ హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు

NANI@42: నాని బర్త్ డే స్పెషల్.. మినిమమ్ గ్యారెంటీ హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు

ఇంటి పక్కన కుర్రాడిలా తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైన హీరో నాని (NANI). ప్రతి సినిమాతో తన సహజమైన నటనను ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అందుకే ఆయనకు “నేచురల్ స్టార్” అనే బిరుదు దక్కింది. అసలు పేరు ఘంటా నవీన్ బాబు అయినప్పటికీ, “నాని”గా ప్రేక్షకులకు ఇంట్లోవాడిగా దగ్గరయ్యాడు.

నానిగా పరిచయం:

ఫిబ్రవరి 24, 1984న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, చల్లపల్లిలో జన్మించిన నాని, ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తన కెరీర్ ప్రారంభంలో రేడియో జాకీగా, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాని, 2008లో విడుదలైన అష్టా చమ్మా చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. అవకాశాల కోసం ఫోటో ఆల్బమ్స్ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజులు ఆయన జీవితంలో ఉన్నాయి. చిన్న పాత్రలకైనా అవకాశం రాకపోవడం, మోసాలకు గురవడం వంటి అనుభవాలు ఎదురైనా, తన పట్టుదలతో ముందుకు సాగారు.

అలా కష్టాల్ని జయించి, వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదిగిన నాని, ఇప్పుడు “మినిమమ్ గ్యారెంటీ హీరో”గా పేరు తెచ్చుకున్నారు. ఆయన సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్, లవ్, యాక్షన్—ఇలా ప్రతీది ఉండాల్సిందే. అది బాక్సాఫీస్ దగ్గర హిట్ అవ్వాల్సిందే. ప్రస్తుతం నాని తన కొత్త చిత్రం ప్యారడైజ్ (The Paradise) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.

 ‘ది ప్యారడైజ్’: 

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో ‘దసరా’ తర్వాత రూపొందుతోన్న  చిత్రం ‘ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో నాని మాస్ & మెంటల్ స్వాగ్తో జడల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. రగ్డ్‌‌ మీసం, గెడ్డం, రెండు జడలతో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని హడల్ పుట్టించేలా మెరవనున్నారు.  'ది ప్యారడైజ్' చిత్రం కేవలం యాక్షన్ చిత్రంగానే మాత్రమే కాదు. ఒక బలమైన సామాజిక ఇతివృత్తంతో సాగే పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్.

సమాజంలో వివక్షకు గురైన ఒక తెగ కోసం పోరాడే 'జడల్' అనే వ్యక్తి ప్రయాణమే ఈ సినిమా. ఈ విజువల్ వండర్ చిత్రాన్ని  ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 8 భాషల్లో 2026, ఆగస్ట్ 21న  విడుదల చేసేందుకు రెడీ చేస్తున్నారు. ఇది నాని కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న చిత్రంగా 'ది ప్యారడైజ్' నిలువనుంది. 

నిర్మాతగా, హీరోగా:

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాల సక్సెస్తో దూసుకెళ్తున్నారు. హీరోగా చేస్తూనే, మరోవైపు నిర్మాతగా విజయవంతగా రాణిస్తున్నారు. హీరోగా.. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 వంటి బ్లాక్ బస్టర్స్ అందుకుని ఫ్యాన్స్కి బూస్ట్ ఇచ్చాడు.

మరోవైపు, 2018 లో నిర్మాతగా మారి, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను "అ!" సినిమాతో పరిచయం చేశారు. ఆ తర్వాత డైరెక్టర్ శైలేష్ కొలనుతో హిట్ ఫ్రాంచైజ్, రీసెంట్గా రామ్ జగదీశ్ తెరకెక్కించిన "కోర్ట్" వంటి సినిమాలతో భారీ విజయాలు సొంతం చేసుకున్నాడు నాని. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ నలుగురు కొత్త డైరెక్టర్స్ని పరిచయం చేసి విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం ఈ క్రేజీ డైరెక్టర్స్ మంచి స్థాయిలో రాణిస్తూ, బడా బ్యానర్స్ లలో సినిమాలు చేస్తున్నారు.

ప్రస్తుతం నాని హీరోగా మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలను లైన్లో పెట్టేశారు. ‘ది ప్యారడైజ్’ మూవీ తర్వాత, వచ్చే ఏడాది సుజిత్ సినిమాతో రాబోతున్నాడు. యూర‌ప్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్ స్టర్ యాక్షన్ థ్రిల్లర్గా రానుంది. ఇవాళ నాని బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు బ్లడీ రోమియో (BloodyRomeo) అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.