సీఎం కప్ అథ్లెటిక్స్ ఓవరాల్ ఛాంపియన్ భద్రాద్రి కొత్తగూడెం

సీఎం కప్ అథ్లెటిక్స్ ఓవరాల్ ఛాంపియన్ భద్రాద్రి కొత్తగూడెం

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నాలుగు రోజులపాటు జరిగిన సీఎం కప్ అథ్లెటిక్స్ మీట్-2025 లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచింది. అన్నీ కలిపి 105 పాయింట్లతో భద్రాద్రి కొత్తగూడెం అగ్రభాగంలో నిలవగా, ఖమ్మం జిల్లా 98 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

ఇక పురుషుల విభాగంలో ఖమ్మం జిల్లా 51 టాప్ లో నిలవగా, మహిళల విభాగంలో 66 పాయింట్లతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తా చాటింది. కాగా, హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు.

జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు నిలయమైన హనుమకొండ జిల్లాను స్పోర్ట్స్ హబ్ గా మారుస్తామన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సీఎం కప్ నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజీజ్ ఖాన్, డీవైఎస్ వో గుగులోత్ అశోక్ కుమార్, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సారంగపాణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.