పాలకుర్తి, వెలుగు: జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు ట్రైబల్ వెల్ఫేర్ బాలికల బాధ్యత తనదేనని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం ట్రైబల్ వెల్ఫేర్ బాలికల స్కూల్ఆండ్ కాలేజీకి చెందిన విద్యార్థులు ఉడుకని బువ్వ, రుచిలేని కూర, గతంలో వారికిచ్చే రోజువారి మెనూ బాధ్యత వహించాల్సిన హాస్టల్ మెట్రిన్ కు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని రోడ్డెక్కారు.
హాస్టల్ లో టాయిలెట్ల నిర్వహణ సరిగా లేదని, ఏ సమయానికి భోజనం పెడతారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మెట్రిన్ రేణుక రాథోడ్ ఎప్పుడు వస్తుందో తెలియదని, తమ సమస్యలు పట్టించుకోరని అన్నారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి స్టూడెంట్స్ వద్దకు వెళ్లారు. వారి సమస్యలు, హాస్టల్ నిర్వాహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి నుంచి ఏ ఇబ్బందులు ఉన్నా తాను బాధ్యత తీసుకుంటానని స్టూడెంట్స్ కు హామీ ఇచ్చారు.
వారిని హాస్టల్ వరకు తీసుకెళ్లి కిచెన్ హాల్, వంటలను పరిశీలించారు. అంతకుముందు ఎమ్మెల్యే పాలకుర్తి మండల కేంద్రంలో జరిగిన సంత్‌సేవాలాల్ జయంతి వేడుకలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డితో కలిసి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో సేవాలాల్ భవన నిర్మాణ ఏర్పాటు కోసం కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు అమ్యా నాయక్, కొడకండ్ల మండలాధ్యక్షుడు ధారావత్ సురేశ్‌నాయక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధారావత్ రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
