AP News: విషం పాలు తాగి 2 రోజుల్లో ఐదుగురు మృతి.. 9 మందికి సీరియస్.. !

AP News: విషం పాలు తాగి 2 రోజుల్లో ఐదుగురు మృతి.. 9 మందికి సీరియస్.. !

అన్నీ కల్తీ.. నూనెలు, పండ్లు, ఉప్పులు, పప్పులు, పసిపాపలు తాగే పాల వరకు   సర్వం కల్తీ..దేన్నీ వదలడం లేదు కల్తీగాళ్లు.. ఎవడి ప్రాణాలు పోతే మాకేంటి.. లాభార్జన లక్ష్యంగా తినే తిండిని కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. నాణ్యత లేని విషపూరిత రసాయనాలను కలిపి విక్రయిస్తున్నారు. ఇది క్యాన్సర్, కాలేయ సమస్యలు, మూత్రపిండాల వ్యాధులకు దారితీస్తోంది. కల్తీ ఆహారం వల్ల ఇటీవల రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఐదుగురు మృతి చెందడం ఆందోళనకరంగా మారింది. 

స్వచ్ఛమైన పాలు.. కాలకూట విషంలా మారాయి.. మొన్న ఇద్దరు.. నిన్న ముగ్గురు.. రాజమండ్రి కల్తీ  పాలు తాగిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.  మరో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ఇద్దరు చిన్నారులు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.  

రాజమండ్రిలో కల్తీ పాలు తాగిన ఘటనలో శనివారం ఇద్దరు చనిపోగా చికిత్స పొందుతూ సోమవారం మరో ముగ్గురు చనిపోయారు. మృతులు - రాధాకృష్ణమూర్తి (74), ఎన్‌.శేషగిరిరావు (72), తాడి రమణి(58) గుర్తించారు. 

ఈ ఘటనపై సీరియస్ గా స్పందించింది ఏపీ ప్రభుత్వం.. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. దర్యాప్తు వేగంవంతం చేయాలని పోలీసులను ఆదేశించింది. విచారణ తర్వాత బాధిత కుటుంబాలకు పాలు పోసిన కోరుకొండకు చెందిన పాల వ్యాపారి అడ్డాల గణేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  

నిందితుడు అక్రమంగా నిర్వహిస్తున్న పాలకేంద్రంలో అధికంగా రసాయనాలు కలవడం వల్లే  ఈ దారుణం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.  పాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచే రసాయనాలు ఎక్కువ మోతాదులో కలపడంతో పాలు కలుషితం అయినట్లు తెలుస్తోంది. 

పాలవ్యాపారి గణేష్ పై వివిధ పోలీస్‌ స్టేషన్లలో మృతుల కుటుంబాల ఫిర్యాదుల మేరకు 4 హత్య కేసులు నమోదయ్యాయి. మరోవైపు సోమవారం సాయంత్రానికి 64 కుటుంబాల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి కిడ్నీ, కాలేయ పరీక్షలకు పంపించారు. చికిత్స పొందుతున్న, మృతి చెందినవారి బ్లడ్ , యూరిన్ ,పాల శాంపిల్స్ ను సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌తో పాటు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లోని ప్రయోగశాలలకు పంపించారు. ఫలితాలు వస్తే గానీ మృతికి గల కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.