
సెయింట్ లూయిస్ (అమెరికా): గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా జరుగుతున్నసెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీలో.. ఇండియా గ్రాండ్ మాస్టర్, వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్ ఆకట్టుకున్నాడు. సోమవారం రాత్రి జరిగిన తొలి రౌండ్‌లో రెండు విజయాలు, ఒక ఓటమిని నమోదు చేశాడు. తొలి గేమ్‌లో గుకేశ్.. యూఎస్ గ్రాండ్ మాస్టర్ లెవోన్ అరోనియన్ చేతిలో ఓడాడు. క్లిష్టమైన ఓపెనింగ్‌తో కూడిన కారో కాన్ డిఫెన్స్ గేమ్ ఆడిన అరోనియన్‌ను ఏ దశలోనూ ఇండియన్ ప్లేయర్ అడ్డుకోలేకపోయాడు.
అయితే ఈ ఓటమి నుంచి తొందరగానే తేరుకున్న గుకేశ్.. తర్వాత రెండు గేమ్‌ల్లో సూపర్ పెర్ఫామెన్స్ చూపెట్టాడు. గ్రిగొరి ఒపారిన్ (అమెరికా)తో జరిగిన గేమ్‌లో ఈజీగా నెగ్గాడు. సిసిలియన్ రోసోలిమో స్ట్రాటజీలో గుకేశ్ ముందుగా క్వీన్‌ను త్యాగం చేసి ఒపారిన్‌కు చెక్ పెట్టాడు. ఇక లియామ్ లీ క్వాంగ్ (వియత్నాం)తో జరిగిన మూడో గేమ్‌లో గుకేశ్ నల్ల పావులతో ఆడాడు. మధ్యలో తీవ్రమైన అడ్డంకులు ఎదురైనా పట్టు విడవకుండా ఆడాడు.
ఫలితంగా ఒత్తిడికి లోనైన లియామ్ చివర్లో చేతులెత్తేశాడు. ఈ రౌండ్ తర్వాత అరోనియన్ (6), కరువాన (5) టాప్–2లో ఉండగా, గుకేశ్, వెస్లీ చెరో నాలుగు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నారు. వాచిర్ లాగ్రేవ్, డొమ్నిగ్వేజ్ చెరో మూడు పాయింట్లతో, ఒపారిన్, లియామ్ చెరో రెండు పాయింట్లతో అబ్దుసత్తారోవ్, షాంక్లాండ్ చెరో ఒక పాయింట్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.