బీసీలను సీఎం మళ్లీ మోసం చేసిన్రు : డి. రాజారాం యాద‌‌వ్

బీసీలను సీఎం మళ్లీ మోసం చేసిన్రు : డి. రాజారాం యాద‌‌వ్
  •     బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్​
  •      ‘బీసీల‌‌కు మ‌‌రో మోసం’ అంశంపై సదస్సు

పంజాగుట్ట, వెలుగు : బీసీలను సీఎం అన్ని రకాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో సహా పెకిలించేందుకు బీసీలంతా ఏకం కావాల‌‌ని బీసీ జనసభ అధ్యక్షుడు డి. రాజారాం యాద‌‌వ్ పిలుపునిచ్చారు. సోమ‌‌వారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో  ‘బీసీల‌‌కు మ‌‌రో మోసం 2026 బ‌‌డ్జెట్’ అంశంపై జ‌‌రిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్​ను మర్చిపోయారని, బ‌‌డ్జెట్ కేటాయింపుల్లో బీసీల‌‌కు చేసిన అన్యాయానికి నిర‌‌స‌‌న‌‌గా ఛ‌‌లో అసెంబ్లీకి పిలుపునిస్తున్నట్టు ప్రకటించారు. బీసీ సంఘాల లీడర్లు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, చిరంజీవి, నార‌‌గోనిలను సంప్రదించి ఉమ్మడి ఐక్య కార్యాచ‌‌ర‌‌ణ‌‌ ప్రకటిస్తామన్నారు. 

మండ‌‌లిలో ప్రతిపక్ష నేత, మాజీ స్పీక‌‌ర్ మ‌‌ధుసూద‌‌న‌‌చారి మాట్లాడుతూ బీసీల ప‌‌ట్ల కాంగ్రెస్ వైఖ‌‌రిని ప్రజాక్షేత్రంలో ఎండ‌‌గ‌‌డ‌‌తామ‌‌న్నారు. మాజీ ఎంపీ బడుగుల లింగ‌‌య్య మాట్లాడుతూ త్వరలో జిల్లాల వారీగా కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. మండలాల్లో రౌండ్ టేబుల్ స‌‌మావేశాలు ఏర్పాటు చేసి, కాంగ్రెస్ ద్వంద్వ వైఖ‌‌రిని ఎండ‌‌గ‌‌డ‌‌తామ‌‌ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. 2023 ఎన్నిక‌‌లప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ ప‌‌చ్చి మోస‌‌మ‌‌ని సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్​జూలూరి గౌరీశంక‌‌ర్ ఆరోపించారు. యాద‌‌వ హ‌‌క్కుల పోరాట స‌‌మితి జాతీయ అధ్యక్షుడు మేక‌‌ల రాములు యాద‌‌వ్, స‌‌ర్పంచుల సంఘం అధ్యక్షుడు యాద‌‌య్య గౌడ్, బీసీ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కాటం న‌‌ర్సింహులు, భేరీ రాంచంద‌‌ర్ యాద‌‌వ్, సాయ‌‌న్న ముదిరాజ్, బ‌‌లిజ ర‌‌మేష్, సింహం, లొడంగి గోవ‌‌ర్ధన్​, వీరేశం, అయోధ్య, ఓయూ విద్యార్థి నాయ‌‌కుడు దత్తాత్రేయ‌‌, మ‌‌హేష్ గౌడ్ పాల్గొన్నారు.