వహీదా రెహ్మాన్​కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

వహీదా రెహ్మాన్​కు  దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

బాలీవుడ్ సీనియర్ నటి వహీదా రెహ్మాన్ (85) దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు.  ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఐదు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నందుకు గాను ఆమెను ఈ అవార్డు వరించింది. 1955లో ‘రోజులు మారాయి’ అనే తెలుగు సినిమాతో ఫిల్మ్​ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వహీదా రెహ్మాన్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ‘రోజులు మారాయి’ సినిమాలో ‘ఏరువాకా సాగారో..’ పాటకు ఆమె డ్యాన్స్ చేశారు. 1972లో పద్మ శ్రీ , 2011లో పద్మభూషణ్‌‌ అవార్డు అందుకున్నారు. 

న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి వహీదా రెహ్మాన్ (85).. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌‌ ఠాకూర్‌‌ మంగళవారం ప్రకటించారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి 5 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నందుకు గాను ఆమెకు ఈ అవార్డు వరించింది. సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వహీదా రెహ్మాన్కు ఈ ఏడాదికి గాను దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్​మెంట్ పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు.

హిందీ సినిమాల్లో వహీదా తన క్యారెక్టర్​లతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారని చెప్పారు. వాటిల్లో ప్యాసా, కాగజ్ కే ఫూల్, చౌదావీ కా చాంద్, సాహెబ్ బీవీ ఔర్ గులామ్, గైడ్, ఖామోషీ సినిమాలు ఉన్నాయని తెలిపారు. ఐదు దశాబ్దాలకు పైగా ఆమె కెరీర్ కొనసాగిందని వివరించారు. ఎంతో కష్టపడి తన కెరీర్​లో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న భారతీయ వనితకు వహీదా నిదర్శనమని కేంద్ర మంత్రి ఠాకూర్ పేర్కొన్నారు.

సంతోషంగా ఉంది : వహీదా రెహ్మాన్

దాదా సాహెబ్‌‌ ఫాల్కే లైఫ్ అచీవ్​మెంట్ అవార్డుకు ఎంపికవ్వడం సంతోషంగా ఉందని వహీదా రెహ్మాన్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. తన నటనకు మరొక గుర్తింపు దక్కినందుకు ఆనందంగా ఉందన్నారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దాని వెనుక ఎంతో మంది ప్రేమ, అభిమానం, ఆప్యాత ఉందని చెప్పారు.

ఈ అవార్డును తోటి నటీనటులకు, సినీ ఇండస్ట్రీలోని అందరికీ అంకితం చేస్తున్నట్లు తెలిపారు. సినిమా రంగం తనను ఎంతో ఆదరించిందన్నారు. ఎవరైనా అంకితభావం, నిజాయితీతో పని చేస్తే ఫలితం తప్పకుండా దక్కుతుందన్నారు. తాను నటించిన సినిమాల్లో గైడ్ ఎంతో ఇష్టమని తెలిపారు.

విశాఖపట్నంలో చదువుకున్న వహీదా

1938 ఫిబ్రవరి 3న తమిళనాడు చెంగల్​పట్టులో వహీదా రెహ్మాన్ పుట్టారు. తండ్రి అబ్దుల్ రెహ్మాన్ కలెక్టర్​గా పని చేశారు. తల్లి ముంతాజ్ బేగమ్. తండ్రి మద్రాస్ ప్రెసిడెన్సీలో విధులు నిర్వహిస్తున్నప్పుడు వహీదా విశాఖపట్నంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్​లో చదువుకున్నారు. 1951లో ఆమె తండ్రి చనిపోయారు. అప్పుడు వహీదా వయస్సు 12 ఏండ్లు. తర్వాత 1955లో తల్లి చనిపోయింది.

డాక్టర్ కావాలని వహీదా అనుకున్నారు. కానీ, ఆమె ఊపిరితిత్తుల్లో ఇన్​ఫెక్షన్ కారణంగా రెగ్యులర్​గా స్కూల్​కు వెళ్లకపోయేది. పేరెంట్స్ సహకారంతో భరతనాట్యం చేరుకుంది. 1974 ఏప్రిల్ 27న కమల్​జీత్​తో పెండ్లి జరగ్గా, 2000లో ఆయన చనిపోయారు. వహీదాకు కొడుకు సోహైల్ రేఖి, కూతురు కేశ్వీ రేఖి ఉన్నారు. 

1995లో సినిమా రంగంలో ఎంట్రీ

1955లో ‘రోజులు మారాయి’ తెలుగు సినిమాతో ఫిల్మ్​ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన వహీదా రెహ్మాన్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ‘రోజులు మారాయి’ సినిమాలో ‘ఏరువాక సాగాలో..’ పాటకు ఆమె డ్యాన్స్ చేశారు. ఆమెను 1972లో ప్రతిష్టాత్మక పద్మ శ్రీ అవార్డుతో కేంద్రం సత్కరించింది. ఆ తర్వాత 2011లో పద్మభూషణ్‌‌ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు దాదాసాహెబ్‌‌ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. దాదాపు 90కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.

తెలుగు, హిందీతో పాటు మరాఠీ సినిమాల్లో కూడా వహీదా నటించారు. ఎక్కువగా హిందీ సినిమాలు చేసి ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ‘బంగారు కలలు’ సినిమాలో అక్కినేని నాగేశ్వర రావు చెల్లెలుగా, సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సింహాసనం’ సినిమాలో రాజమాత రోల్ చేశారు. సీఐడీ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.