- ఏజెన్సీని తప్పిస్తామని వార్నింగ్
- గత నెల 22న రూ.లక్ష ఫైన్వేసిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్
- చెత్త తరలించే వాహనాలూ తక్కువే
హైదరాబాద్ సిటీ, వెలుగు:సిటీలో చెత్త ఎత్తే విషయంలో రాంకీ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. చెత్త తరలించేందుకు రాంకీతో బల్దియా ఒప్పందం చేసుకోగా, అగ్రిమెంట్ ప్రకారం పని చేయడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి.
కార్వాన్, జూబ్లీహిల్స్ సర్కిళ్లలో రోడ్లపై చెత్త ఎత్తలేదని గత నెల 22న ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి రాంకీకి రూ.లక్ష ఫైన్వేశారు. రెండు వారాల కింద గార్భేజ్ వల్నరబుల్ పాయింట్ల వద్ద టైమ్‌కు చెత్తను ఎత్తడంలే దని రాంకీ నోటీసు అందుకోగా, రోడ్లపై వ్యర్థాలను తరలించడంలేదని మరో తాఖీదు కూడా తీసుకుంది. ఈ విషయం బల్దియా కమిషనర్ఆర్వీ కర్ణన్ దృష్టికి వెళ్లడంతో ఏకంగా ఏజెన్సీనే తప్పిస్తామని వార్నింగ్‌కూడా ఇచ్చారు.
అగ్రిమెంట్ ఇలా...
నగరంలో చెత్తను తరలించేందుకు 2009లో రాంకీతో 25 ఏండ్లకు జీహెచ్ఎంసీ అగ్రిమెంట్ చేసుకుంది. ఒప్పందం ప్రకారం నగరంలో ప్రతి ఇంటి నుంచి చెత్తను తరలించడంతో పాటు రోడ్లపై జీవీపీ పాయింట్లలో చెత్తను డంపింగ్ యార్డుకి తరలించాల్సి ఉంటుంది. అది కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతిరోజు ఉదయం 9:30 గంటల లోపు మాత్రమే చేయాలి. ఆ తర్వాత ఎక్కడా చెత్త కనిపించవద్దు. అయితే, ఇంటింటి నుంచి చెత్తను స్వచ్ఛ ఆటోలు సేకరించి ట్రాన్స్ ఫర్ స్టేషన్లకు తరలిస్తుండటంతో రాంకీకి ఇబ్బంది అనేదే లేకుండాపోయింది. అయినా, మిగిలిన చెత్తను తరలించడలోనూ రాంకీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కమిషనర్ సీరియస్ అయ్యారు.
వాహనాలూ తక్కువే...
రోజూ నగరంలో 7500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, ఆ చెత్త తరలించేందుకు బల్దియా.. రాంకీకి టన్నుకి రూ.2750 చెల్లిస్తోంది. ఈ చెత్తను తరలించేందుకు రాంకీ సంస్థ 600 వాహనాలను వినియోగించాల్సి ఉండగా, 340 వాహనాలతోనే తరలిస్తున్నట్లు కమిషనర్ దృష్టికి వచ్చింది. తక్కువ వాహనాలు ఉపయోగించడం వల్ల చెత్త పేరుకుపోయి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
కొన్ని ప్రాంతాల్లో రోజుల తరబడి చెత్తను తరలించకపోవడంతో కాలనీల్లో దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో కమిషనర్సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. అయితే తమకు నిధులు సకాలం లో రావడంలేదని రాంకీ బల్దియా ను కోరింది. అయితే ఇప్పటికే రాంకీకి వెయ్యి కోట్లు చెల్లించాల్సి ఉండగా, వారం కింద బల్దియా కమిషనర్ రూ.100 కోట్లు రిలీజ్ చేశారు. నిధులు ఎలాగూ ఇస్తామని, మీరు అగ్రిమెంట్ ప్రకారం పనులు చేయాలని కమిషనర్ హెచ్చరించారు. రాంకీలో ఏమైనా మార్పు వస్తుందా?అనేది వేచి చూడాల్సి ఉంది.
