ఐపీఎల్‌‌ కంటే పాకిస్థాన్ సూపర్ లీగ్ బెటర్

ఐపీఎల్‌‌ కంటే పాకిస్థాన్ సూపర్ లీగ్ బెటర్

సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్ వివాదాస్పద కామెంట్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కంటే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌‌ఎల్) చాలా బెటర్ అని స్టెయిన్ అన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న స్టెయిన్.. ఐపీఎల్‌‌లో‌ ట్యాలెంట్ కంటే డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందన్నాడు. ‘ఇతర లీగ్‌‌ల్లో ఆడటం కంటే పీఎస్‌‌ఎల్‌‌లో ఆడినప్పుడు చాలా మెరుగ్గా అనిపించింది. ఐపీఎల్‌‌ను చూసుకుంటే అక్కడ పెద్ద టీమ్స్ ఉంటాయి. జట్లలో స్టార్ ప్లేయర్లు ఉంటారు. ఆటగాళ్ల ఆర్జన కూడా ఎక్కువగానే ఉంటుంది. అక్కడ క్రికెట్ కంటే డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు వేలంలో ఎంతకు అమ్ముడుపోయారనే దాని గురించే మాట్లాడుకుంటారు. ఇది నాకు నచ్చలేదు’ అని స్టెయిన్ చెప్పాడు.

ఈ కామెంట్లపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఇన్నాళ్లు ఐపీఎల్‌‌లో ఆడిన ప్లేయర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని నెటిజన్స్ దుయ్యబడుతున్నారు. స్టెయిన్ కామెంట్లపై టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానె ఘాటుగా స్పందించాడు. ‘మన లాంటి ప్లేయర్లకు ఐపీఎల్ ఓ ప్లాట్‌‌ఫామ్‌ను ఇచ్చింది. భారత్‌‌తోపాటు విదేశీ ఆటగాళ్ల ప్రదర్శనకు, సత్తా చాటేందుకు ఇది ఉపయోగపడింది’ అని రహానె పేర్కొన్నాడు. అయితే తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో స్టెయిన్ అందరికీ సారీ చెప్పాడు. తన కెరీర్‌లో ఐపీఎల్ అద్భుతమన్నాడు. ఏ లీగ్‌‌ను కూడా అవమానించడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపలు అంటూ స్టెయిన్ ట్వీట్ చేశాడు.