హుజూరాబాద్ లో దళిత బంధు వంద శాతం అమలు చేయాలి

హుజూరాబాద్ లో దళిత బంధు వంద శాతం అమలు చేయాలి

కరీంనగర్, వెలుగు :  హుజూరాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు పథకాన్ని వంద శాతం అమలు చేస్తామని, ప్రతివారం 200 యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని  జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ ఆఫీసర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్​ హాల్​లో  క్లస్టర్ ఆఫీసర్లు, మండల రిసోర్స్ పర్సన్లు, డెయిరీ ఆఫీసర్లు,  బ్యాంకర్లు, ఎంపీడీవో లతో  దళితబంధు అమలు చర్యలపై రివ్యూ చేశారు.  నియోజకవర్గం లో  ఇప్పటివరకు17,035 మంది  ఖాతాల్లో నగదు జమ చేశామని,  అర్హులైన మిగిలిన 760 మంది ఖాతాల్లో   ఈనెల 27లోగా జమ చేస్తామని కలెక్టర్ చెప్పారు. నగదు జమ అయిన లబ్దిదారులు ఇంతకుముందు ఎంపిక చేసుకున్న యూనిట్లను మార్చుకునేందుకు కూడా చాన్స్​ ఉందన్నారు. డెయిరీ యూనిట్లకు ప్రియారిటీ ఇస్తామన్నారు. పదిమంది ఒక టీమ్​గా ఏర్పడి కూడా యూనిట్లను స్థాపించుకోవచ్చునన్నారు. 20 మంది ఒక బృందంగా ఏర్పడి సొసైటీ పెట్టుకొని  డెయిరీ ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చారని కలెక్టర్ తెలిపారు. గ్రామాలవారీగా లబ్ధిదారులకు అవగాహన కల్పించడంతోపాటు  కరీంనగర్ ,  హైదరాబాదులో శిక్షణ కూడా ఇప్పిస్తామని అన్నారు. ఇంకా అప్లయ్​ చేసుకోని వారు ఉంటే  ఎంపీడీవో ల దగ్గర దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్, హుజూరాబాద్ ఆర్డీఓ రవీందర్ రెడ్డి, డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్సీ  కార్పొరేషన్ ఈడీ  సురేష్ రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్,  డీ ఆర్డీ  ఓ శ్రీలత  పాల్గొన్నారు.