దళితబంధుకు చెప్పిన దానికన్నా తక్కువే

దళితబంధుకు చెప్పిన దానికన్నా తక్కువే
  •     ఏటా రూ.25 వేల కోట్లు కేటాయిస్తామని గతంలో కేసీఆర్​ హామీలు
  •     ప్రస్తుతం ఇచ్చిన మొత్తంలో నియోజకవర్గానికి 1,500 మందికే అందే అవకాశం
  •     ఎస్సీ ఎస్డీఎఫ్​కు రూ.33,937 కోట్ల కేటాయింపులు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకానికి సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చిన దాని కన్నా బడ్జెట్​లో నిధులను తక్కువే కేటాయించారు. ఏటా బడ్జెట్​లో రూ.25 వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నోసార్లు సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చినా.. సోమవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్​లో కేవలం రూ.17,700 కోట్లే కేటాయించారు. ఆ నిధులతో ఒక్కో నియోజకవర్గంలోని 1,500 మంది చొప్పున రాష్ట్రమంతటా 1.7 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకే పథకం అందనుంది. అయితే, రాష్ట్రంలో దాదాపు 17 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికే హుజూరాబాద్​, యాదాద్రి జిల్లా వాసాలమర్రి, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల ఎస్సీలు అందరికీ, 118 నియోజకవర్గాల్లో వంద మందికి చొప్పున దళిత బంధు స్కీంను అమలు చేస్తున్నారు. 

ఎస్సీ ఎస్డీఎఫ్‌‌‌‌‌‌‌‌కు పెరిగిన నిధులు..

గత బడ్జెట్​లో ఎస్సీ అభివృద్ధి శాఖకు రూ.5,588 కోట్లే కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి బడ్జెట్​లో కేటాయింపులను పెంచింది. రూ.20,624 కోట్లను కేటాయించింది. ఎస్సీ స్పెషల్​ డెవలప్​మెంట్​(ఎస్సీ ఎస్డీఎఫ్​)కు రూ.33,937 కోట్లను ప్రతిపాదించింది. అయితే, గత బడ్జెట్​లో కేవలం రూ.21,306 కోట్లే కేటాయించింది. ఈసారి రూ. 12,631 కోట్లు ఎక్కువ కేటాయింపులను చేసింది. ఎస్సీ ఆర్థిక చేయూత పథకానికి రూ.వెయ్యి కోట్లు, ఎస్సీ గురుకులాలకు రూ.1,063 కోట్లు, హాస్టళ్లకు రూ.101 కోట్లు, కల్యాణలక్ష్మికి రూ.400 కోట్లు కేటాయించింది. వివిధ శాఖల్లో ఖర్చు చేసే ప్రతిపైసా లెక్కను ఎస్సీ ఎస్డీఎఫ్​లోనే ప్రభుత్వం చూపిస్తోంది. అయితే, దళితులకు మూడు ఎకరాల భూమి ప్రస్తావనే లేదు.  

ఎస్టీ ఎస్డీఎఫ్​కు రూ.13,412 కోట్లు..

బడ్జెట్​లో ఎస్టీ సంక్షేమ శాఖకు నిధులను కొద్దిగా పెంచారు. నిరుడు రూ.3,056 కోట్లు కేటాయించిన సర్కారు.. ఇప్పుడు రూ.359 కోట్లను పెంచి రూ.3,415 కోట్ల కేటాయింపులను చేసింది. ఎస్టీ ఎస్డీఎఫ్​కు రూ.13,412 కోట్లు ప్రతిపాదించింది. గతేడాది మాత్రం రూ.12,304 కోట్లే కేటాయించింది. రూ.1,108 కోట్లను పెంచింది. ఈ సారి బడ్జెట్​లో ట్రైకార్​కు రూ.493 కోట్లు, ఇంజనీరింగ్​కు రూ.787 కోట్లు, స్కాలర్​షిప్​లు, ఎడ్యుకేషనల్​ స్కీంలకు రూ.633 కోట్లు కేటాయించింది.