కేసీఆర్​ కేబినెట్​లో ఎస్సీలు ఒక్కరేనా?

కేసీఆర్​ కేబినెట్​లో ఎస్సీలు ఒక్కరేనా?
  • ఇదేనా సామాజిక న్యాయం: ఈటల

హనుమకొండ, వెలుగు: సీఎం కేసీఆర్ కేబినెట్ లో సామాజిక న్యాయం ఎక్కడుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఎస్సీలకు 19 శాతం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగం మార్చాలంటున్న కేసీఆర్.. తన కేబినెట్ లో మాత్రం ఒక్క ఎస్సీకే చోటు కల్పించారని మండిపడ్డారు. జనాభాలో 55 శాతమున్న బీసీలకు కేవలం మూడు మంత్రి పదవులిచ్చి.. ఒక్క శాతమే ఉన్న వర్గాలకు 25 శాతానికిపైగా పదవులు ఎందుకు ఇచ్చారో? సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకే కుటుంబంలో నలుగురైదుగురికి మంత్రి పదవులు ఇవ్వడానికి వీల్లేకుండా రాజ్యాంగాన్ని సవరించాలన్నారు. రాజ్యాంగం మార్చాలన్న సీఎం కేసీఆర్ కామెంట్లను ఖండిస్తూ బీజేపీ హనుమకొండ జిల్లా ప్రెసిడెంట్​రావు పద్మ ఆధ్వర్యంలో గురువారం పార్టీ ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి ఈటల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్టీల రిజర్వేషన్లను 9 శాతానికి పెంచుతానని మాటిచ్చిన కేసీఆర్.. వారి నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. ‘‘దోపిడీ చేస్తూ ప్రజలను లెక్క చేయని పార్టీలకు తెలంగాణ సమాజం గుణపాఠం చెబుతుంది. ఉద్యమాల తెలంగాణలో చైతన్యం ఎన్నటికీ చచ్చిపోదు. సందర్భం వచ్చినప్పుడు సత్తా చూపుతుంది. ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టడానికి బీజేపీ ముందుండి పోరాడుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే శక్తి ప్రజలకే ఉంటుంది. బానిసత్వంలోకి జారకముందే అందరూ కలిసికట్టుగా పోరాడాలి”అని ఈటల పిలుపునిచ్చారు. 

రాష్ట్రంలో స్వేచ్ఛ లేదు... 
‘‘సీఎం కేసీఆర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పని చేస్తున్నరు. కేసీఆర్ రాజ్యంలో ఫండమెంటల్ రైట్స్​కనిపిస్తలేవ్. మాట్లాడే హక్కు లేదు. పత్రికా, టీవీలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. సోషల్​మీడియా మీద నియంత్రణ పెట్టిండు’’ అని ఈటల మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు పెరిగిపోయాయన్నారు. ‘‘రాజ్యాంగంలో తప్పులున్నా, అమలు చేసేటోళ్లు మంచివాళ్లయితే ప్రజలకు లాభం జరుగుతుంది. పాలకులు రాజ్యాంగ స్ఫూర్తిని పాటించకపోతే ప్రమాదమని నాడే అంబేద్కర్ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికీ డెవలప్​మెంట్ ఆఫ్​ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్​ అమలు కావడం లేదు. ఇక్కడి పాలకుల దృష్టి నీచమైంది. అంతా నేనే అన్న ధోరణిలో కేసీఆర్ ఉన్నారు. ఆయనకు అధికారంలో లేనప్పుడు  ధర్మం, న్యాయం, రాజ్యాంగ సూత్రాలు కనిపించాయి. కానీ సీఎం అయినంక అవేవీ కనిపించడం లేదు. ఉద్యమ నినాదాలను కేసీఆర్​మరిచాడు. ఇప్పుడు ఆయన మాటలు వింటుంటే అసహ్యమేస్తోంది” అని ఈటల మండిపడ్డారు.  

ఓట్లకు వెల కట్టిండు.. 
సీఎం కేసీఆర్​రాష్ట్రంలో ఓటుకు కూడా వెలగట్టే పరిస్థితి తీసుకొచ్చారని ఈటల ఫైర్ అయ్యారు. ‘‘ఒక ల్యాండ్ డీలింగ్ లో వచ్చిన రూ.600 కోట్లను సీఎం హుజూరాబాద్ ఎన్నికల్లో ఖర్చు పెట్టిండు. ఒక్కో నాయకుడికి వారి స్థాయిని బట్టి ముట్టజెప్పిండు” అని ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అధికారంలో ఉన్న పార్టీ చెప్తే చేసే ఇన్​స్ట్రుమెంట్స్​గా తయారయ్యారని విమర్శించారు. 

లక్షల కోట్లు సంపాదించిండు: ప్రేమేందర్ రెడ్డి  
టీఆర్ఎస్​నేతలు కబ్జాలు, సెటిల్​మెంట్లు, బెదిరింపులతో రూ.వేల కోట్లు సంపాదిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి అన్నారు. సీఎం అయినంక కేసీఆర్ దాదాపు రూ.10 లక్షల కోట్ల విలువైన ఆస్తులు సంపాదించాడని ఆరోపించారు. ధరణిలో భూములు కనపడకుండా చేసి, 20 లక్షల నుంచి 30 లక్షల మంది ప్రజలను ఇబ్బంది పెడతున్నారన్నారు. టీఆర్ఎస్ అవినీతి పాలన సాగిస్తోందని, రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన కామెంట్లకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ రామారావు, పార్టీ జిల్లా ఇన్​చార్జ్ వి.మురళీధర్ గౌడ్, వరంగల్ జిల్లా ఇన్​చార్జ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మార్తి నేని ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.