దళితులు గెలిచిన్రు.. సీఎం ఓడిపోయిండు : కేఏ పాల్

దళితులు గెలిచిన్రు.. సీఎం ఓడిపోయిండు : కేఏ పాల్

నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా పడటంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము  న్యాయ పోరాటం  చేయడంతోనే కొత్త సెక్రటేరియట్ ప్రారంభం వాయిదా పడిందన్నారు. ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల విజయంగా కేఏ పాల్ అభివర్ణించారు. అంబేద్కర్ బడుగు బలహీనవర్గాలు దళితులు గెలిచారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఓడిపోయారని చెప్పారు.

రిపబ్లిక్ డే జరుపుకోవడానికి  అడ్డు వచ్చిన కరోనా... ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టుకోవడానికి అడ్డు రాలేదా అని పాల్ ప్రశ్నించారు. కేసీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రేషన్ చేసుకోవడానికి కరోనా అడ్డు రాదా అని నిలదీశారు. అంబేద్కర్ పై, రాష్ట్ర ప్రజలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కి గౌరవం లేదని కేఏ పాల్ మండిపడ్డారు. 

తమ ఫోన్లు ట్యాప్ చేయడం లేదని కేసీఆర్ దేవుడి మీద ఒట్టేసి చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. తాను జాతీయ నాయకులతో మాట్లాడినప్పుడు తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయగలరు, పోలీసులను వాడగలరు.. కానీ దేవున్ని కొనలేరని స్పష్టం చేశారు. సాక్షాత్తు హైకోర్టే ముఖ్యమంత్రి కేసీఆర్ పై మొట్టికాయలు వేసిందని కేఏ పాల్ విమర్శించారు.