రేపు, ఎల్లుండి కూడా మోస్తరు వర్షాలు

రేపు, ఎల్లుండి కూడా మోస్తరు వర్షాలు

హైదరాబాద్ లోని పలుచోట్ల ఇవాళ సాయంత్రం వర్షం కురిసింది. దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, మలక్ పేట పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీ  వర్షానికి పలుచోట్ల పంట నష్టం వాటిల్లింది. దీంతో అన్నదాతలు ఆందోళనలో మునిగిపోయారు.

వరంగల్ లో తడిసి ముద్దైన పత్తి

వరంగల్ లో భారీ వర్షానికి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో పత్తి తడిసి ముద్దైంది. రెగ్యులర్ గా కురుస్తున్న  వర్షాలతో పంటలు నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అధికారులు ఎలాంటి టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో పత్తి పూర్తిగా నానిందని ఆరోపిస్తున్నారు. తడిసిన పత్తికి రేటు తక్కువ పలికితే.. కూలీల డబ్బులు కూడా తమకు తిరిగి రావని ఆందోళన చెందుతున్నారు. 

భైంసాలో రోడ్లు జలమయం

నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని సర్కార్ కొనాలని రైతులు కోరుతున్నారు.  

మహబూబాబాద్ జిల్లాలో పిడుగుపడి ముగ్గురి మృతి

మహబూబాబాద్ జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడి ముగ్గురు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బయ్యారం పెద్ద చెరువు కట్టపై పిడుగుపడి పశువుల కాపరి మెస్సు కిరణ్, జగ్యాతండాకు చెందిన బూక్యహుస్సేన్, లక్ష్మీ పురంలో తేజావత్ మల్సూర్ చనిపోయారు. 

మంచిర్యాల జిల్లాలో రైతు ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట లో విషాదం జరిగింది. గంపలపల్లి గ్రామానికి చెందిన శంకరయ్య అనే రైతు పొలంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకున్న రెండెకరాల భూమితోపాటు.. మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని వరి, పత్తి పంటలు వేశాడు. భారీ వర్షాలతో పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో మనస్థాపానికి లోనై.. అప్పులు ఎలా తీర్చాలనే ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శంకరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు భారీగా వరద  

రాష్ట్రంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగానే అధికారులు దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ఇక తెలంగాణపై ద్రోణి ప్రభావం ఇంకా కొనసాగుతోందని, దీనివల్ల రేపు, ఎల్లుండి కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించింది. 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉందని తెలిపింది.