నిర్మల్ జిల్లా కడెం ఎడమ కాల్వకు దస్తూరాబాద్ సమీపంలో గండి పడింది. దీంతో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ప్రాజెక్టుకు మొత్తం మూడు చోట్ల గండిపడింది. మైసమ్మ గుడి, ఎడమ కాలువ, పవర్ హౌస్ వద్ద పడిన గండ్ల వల్ల భారీగా పంట నష్టం సంభవించింది. దీనివల్ల నవాబు పేట్, అంబారి పేట్, దేవునిగూడెం, దస్తూరాబాద్, పెరకపల్లి, మున్యాల్, రేవోజి పేట్, మల్లాపూర్, కలమడుగు, మురిమడుగు, జన్నారం గ్రామాలు ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కడెం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని సాగునీటి రంగ నిపుణులు దొంతి లక్ష్మీనారాయణ అంటున్నారు. కడెం ప్రాజెక్టులో 18గేట్లకు గాను 17 గేట్లే పనిచేస్తున్నాయని..ఆ గేటు కూడా పనిచేస్తే వరద ఉధృతి కొంచెం తక్కువగా ఉండేదన్నారు. కడెం ప్రాజెక్టు ఉప్పొంగితే మంచిర్యాల పట్టణం మునిగిపోతుందని ఆయన హెచ్చరించారు. ఇరిగేషన్ శాఖలో మెకానికల్ డిపార్ట్ మెంట్ ను తీసేశారని.. వ్యవస్థాగత లోపం వల్లే ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయని చెప్పారు.
మరోసారి ప్రమాదకర స్థాయికి..
కడెం ప్రాజెక్టు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిపోయి, ఓవర్ ఫ్లో అవుతోంది. నీరు కట్టను తాకుతోంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు ఉంది. ఇక కడెం ప్రాజెక్టు తెగిపోయినట్టుగా ప్రసారం అవుతున్న వీడియోలు వాస్తవం కాదని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. డ్యాం బ్రేక్ అయినట్టు ఇంజనీర్ల నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. క్యాచ్మెంట్ ఏరియాలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోందన్నారు.
