సిటీ రోడ్లపై గుంతలు..వాహనదారుల తీవ్ర ఇక్కట్లు

సిటీ రోడ్లపై గుంతలు..వాహనదారుల తీవ్ర ఇక్కట్లు

హైదరాబాద్, వెలుగు: సిటీ రోడ్లపై బైక్ నడపడం ప్రమాదకరంగా మారుతోంది.  రోడ్ల మీద  చిన్న చిన్న గుంతలు, కంకర, ఇసుక, మట్టి ఉండటం వల్ల బైక్​లు స్కిడ్ అయి  ప్రాణాల మీదకు వస్తున్నాయి.  సిటీలో జరిగే ప్రమాదాల్లో 60 శాతం టూ వీలర్లకు సంబంధించినవే ఉంటున్నాయి. ఇందులో 50 శాతం మంది చనిపోతున్నట్లు అంచనా. అమెరికాకు చెందిన హాప్ కిన్స్ బ్లూమ్ బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, డబ్ల్యూ హెచ్ వో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఏపిడెమియాలసీ,ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తో కలిసి సిటీలోని రోడ్డు ప్రమాదాలపై గతంలో ఓ స్టడీ చేసింది. 9 నెలల పాటు జరిగిన ఈ స్టడీలో 58.2 శాతం బైక్ పై వెళ్లే వారే యాక్సిడెంట్లకు గురవుతున్నట్లు తేలింది. గ్రేటర్​లో మూడున్నర లక్షల  మ్యాన్‌‌ హోల్స్, లక్షా 29వేల క్యాచ్‌‌పిట్‌‌లు ఉన్నాయి. నగరవ్యాప్తంగా రోడ్లమీద సుమారు 4,500కు పైగా  గుంతలున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం వస్తుందంటే బైక్​ నడిపేవాళ్లు మరింత  భయపడుతున్నారు.  రోడ్లపై నీరు నిలిచిపోవడం, ఎక్కడ గుంతలు ఉన్నాయో, మ్యాన్‌‌హోల్స్ ఉన్నాయో తెలియక  అవస్థలు పడుతున్నారు. 

3 నెలల్లో 1,819 ప్రమాదాలు..

సిటీలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 68శాతం బైక్​ రైడర్లవే ఉంటున్నాయి. ఇందులో మెజారిటీ కేసులు బైక్ నడిపేవారి తప్పు లేకుండా స్కిడ్ అయి పడిపోవడంవల్లే జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సైబరాబాద్, రాచకొండ పరిధిలో 1,819 యాక్సిడెంట్స్ జరిగాయి. వీటిలో 65 శాతానికి పైగా బైక్ నడిపి ప్రమాదానికి గురైన వారే ఉన్నారు. 2020లో 3 కమిషనరేట్ల పరిధిలో 7,573మంది ప్రమాదాలు జరిగితే అందులో సగటున 60శాతం, 2021లో 8,565 యాక్సిడెంట్ కేసులు నమోదైతే వాటిలోనూ 65 శాతం టూవీలర్స్ ఉన్నారు. 

రోడ్ కాంగ్రెస్ అంచనా ప్రకారం..

ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అంచనాల ప్రకారం.. ఒకసారి సిమెంట్ రోడ్ వేస్తే అది 10 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండాలి. అలాగే తారు రోడ్డు వేస్తే ఆరేడు ఏండ్లు ఎలాంటి రిపేర్లు అవసరం లేకుండా ఉండాలి. కానీ బల్దియా ఎక్కడ రోడ్ వేసినా అది ఏడాదికే చెడిపోయి వాహనదారులకు ఇబ్బంది కలుగుతోందని ఫోరం గుడ్ ఫర్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభ రెడ్డి చెప్తున్నారు.  జనాభాను దృష్టిలో పెట్టుకుని సరైన రోడ్ల ప్రణాళిక డెవలప్ చేయాలంటున్నారు.

ఏడాది కిందట సైదాబాద్​కు చెందిన  కావ్య(23) పరీక్ష రాసేందుకు, ఆమె అన్న శివతో కలిసి  బైక్​ పై వెళ్తుండగా..  మలక్ పేట వద్ద యాక్సిడెంట్ జరిగింది. బస్సును దాటే క్రమంలో ఎదురుగా కంకర తేలిన రోడ్డు ఉండడంతో బైక్​ స్కిడ్​ అయ్యింది.  దీంతో కావ్య బస్సు చక్రాల కింద పడి చనిపోయింది. శివకు గాయలయ్యాయి. ప్రమాదానికి కారణం బైక్ స్కిడ్​ కావడమేనని పోలీసులు తేల్చారు. సన్​సిటీకి చెందిన ప్రవీణ్​ డ్యూటీ ముగించుకొని బైక్​పై ఇంటికి వెళ్తున్నాడు. రోడ్డుపై ఇసుక పేరుకుపోయి ఉండడంతో బైక్​ స్కిడ్​ అయింది.  ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా.. బెడ్​ రెస్ట్​ తీసుకుంటున్నాడు. కొద్ది రోజుల కిందటే అతనికి పాప పుట్టింది. తల్లీ, బిడ్డ బాగుగోలు చూసుకుంటూ.. సంతోషంగా ఉండాల్సిన ప్రవీణ్​ రోడ్డు ప్రమాదం వల్ల మంచాన పడటం అతడిని ఎంతో బాధిస్తోంది. ఈ రెండు ఘటనలే కాదు. సిటీలో రోడ్లు బాగోలేక బైక్ లు అదుపుతప్పి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కేర్ ఫుల్​గా బైక్​ నడుపుతున్న వాళ్లూ ప్రమాదాలకు గురై గాయపడుతున్నారు.  

మేమే బాగుచేస్తున్నం

రోడ్ల మీద ఏర్పడిన గుంతలు, అక్కడక్కడ వదిలేసిన కంకర వల్ల గతంలో ఒకసారి బైక్ స్కిడ్ అయి పడిపోయా. నెలలు గడుస్తున్నా రోడ్లు అలాగే ఉండటంతో  నా ఫ్రెండ్స్ తో కలిసి  వాటిని బాగు చేయాలనుకున్నా. రోడ్లు బాగాలేక ఎంతో మంది యాక్సిడెంట్ల బారిన పడుతున్నారు. అందుకే గుంతలను పూడుస్తున్నాం. మమ్మల్ని చూసైనా అధికారులు స్పందిస్తే వస్తే బాగుంటుంది. – ప్రశాంత్, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్, ఉప్పల్

పట్టించుకుంటలే..

సిటీలో రోడ్లు బాగా డ్యామేజ్ ​అయ్యాయి. ఎక్కడపడితే అక్కడ పాట్​హోల్స్​ ఉన్నాయి. కొన్నిచోట్ల మ్యాన్​ హోల్స్ మూతలు పైకి తేలి ఉంటున్నాయి. ఇలాంటి వాటిల్లో పడి ఎక్కువ మంది యాక్సిడెంట్లకు గురవుతున్నారు. ఈ తరహా ప్రమాదాల్లో తల, భుజాలకు గాయాలవుతున్నాయి. ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. ఈ సమస్యపై అధికారులను ఎన్నిసార్లు కలుస్తున్నా యాక్షన్​ తీసుకోవడం లేదు. – వినోద్ కుమార్ కనుమల, చీఫ్ ఫంక్షనరీ, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ.

 

ఇవి కూడా చదవండి

పెట్టుబడుల వరద రాబోతుందంటారు.. కానీ

వేసవి అయిపోతుంది.. బడులు ఇంకెప్పుడు బాగుచేస్తరు?

కేర్ తీసుకోకపోతే పిల్లల్లో స్కిన్ ప్రాబ్లమ్స్

బీటెక్ వాళ్లు కూడా సోషల్ సైన్స్ చదవొచ్చు