పెట్టుబడుల వరద రాబోతుందంటారు.. కానీ

పెట్టుబడుల వరద రాబోతుందంటారు.. కానీ

దావోస్​లో జరుగుతున్న వరల్డ్​ ఎకనామిక్​ ఫోరమ్​ 2022 సదస్సుకు దేశంలోని పలువురు కేంద్ర మంత్రులు సహా ఆయా రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వ అధినేతలు, మంత్రులు కొత్త పారిశ్రామిక విధానాలు, ఆర్థిక మోడల్స్ తో వెళ్లకుండా.. నామ్​కే వాస్తు సదస్సుకు హాజరుకావడం వల్ల పెద్దగా ఫలితం ఏమీ ఉండదని గత అనుభవాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. పెట్టుబడుల ప్రవాహాన్ని ఏది అడ్డుకుంటున్నదో గుర్తించి, దాన్ని పరిష్కరించడంతోపాటు పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పాటు చేసుకుంటేనే సదస్సులో జరిపిన చర్చలకు ఫలితం ఉంటుంది. 
దావోస్‌‌‌‌లో జరిగే వార్షిక వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు భారతీయ నాయకులకు చక్కని వేదిక.

పెట్టుబడుల ఆకర్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాయకులు దావోస్‌‌‌‌లో ఉన్నత స్థాయి పర్యటనలు చేస్తుంటారు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ సదస్సు పరిమితంగా మారుతోంది. ఒకప్పటిలా కాకుండా ఆహ్వానం ఉంటేనే ఎవరైనా సదస్సుకు హాజరయ్యే స్థితికి చేరుకుంది. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ. 2.35 లక్షలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఏటా దావోస్‌‌‌‌లో జనవరి నెలలో జరిగే ఈ సదస్సు కరోనా ప్రభావంతో ఆలస్యంగా మే 22 నుంచి 26 వరకు నిర్వహిస్తున్నారు. 


ఫలితాలు ఎందుకిలా?
ఏటా వరల్డ్​ఎకనామిక్​ఫోరం సదస్సులో  ప్రపంచ దిగ్గజ కార్పొరేట్​ప్రతినిధులు, వ్యాపారులు, ఉత్పత్తిదారులు పాల్గొంటారు. ఏటా అక్కడ ప్రభుత్వాధినేతలు, మంత్రులు దేశానికి, రాష్ట్రాలకు పెట్టుబడుల వరద రాబోతుందని చెప్తూ వస్తున్నారు. సదస్సులో వారి మాటల ప్రకారం ఫలితాలు చాలా అద్భుతంగా ఉండాలి. అయితే, గత అనుభవాలను పరిశీలిస్తే సదస్సుల ద్వారా వస్తున్న ఫలితాలు అంత మెరుగ్గా ఉండటం లేదని అర్థమవుతోంది. ప్రభుత్వ పెద్దలు చేసే ఇటువంటి ఉన్నత స్థాయి పర్యటనలు పెట్టుబడుల ప్రవాహాల పరంగా నిజంగా తగిన ఫలితాలను ఇవ్వడం లేదు. దానికి గల కారణాలను విశ్లేషించుకోవాలి. పెట్టుబడుల ప్రవాహాన్ని ఏది అడ్డుకుంటున్నదో గుర్తించి, దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అందుకు బలమైన యంత్రాంగం అవసరం. ప్రపంచ మార్కెట్​స్థితిగతులు, ప్రజల అవసరాలను గుర్తించి వాస్తవిక దృక్పథంతో చర్యలు తీసుకోవాలి.  
కొత్త విధానాలతో వెళ్తేనే..
పరస్పర ఒప్పందాలు అమలు కావాలంటే పెట్టుబడిదారులు, విధాన రూపకర్తల మధ్య మరిన్ని ఆచరణాత్మక మార్గాలు అవసరం. కొత్త విధానాల మోడల్స్​ప్రకటించడానికి, ప్రదర్శించడానికి దావోస్ ఉత్తమ వేదిక. ఉదాహరణకు1991లో దేశంలో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆ మరుసటి ఏడాది1992లో పీవీ నర్సింహారావు దావోస్‌‌‌‌ను సందర్శించారు. అప్పటి వరకు ఉన్న సాచివేత ధోరణులను తొలగించామని, పెట్టుబడుల విషయంలో ఇండియా మధ్యే మార్గాన్ని అవలంబిస్తున్నట్లు పీవీ ప్రకటించారు. ఆర్థిక విధానంలో ఒక నమూనా మార్పును తీసుకువచ్చారు కాబట్టే ఆయన దావోస్‌‌‌‌ను సందర్శించడం దేశానికి బాగా ఉపయోగపడింది. ప్రభుత్వ పెద్దలు వారి వారి ఆర్థిక మోడల్స్, కొత్త విధానాలతో సదస్సుకు వెళ్లకుండా సాధారణంగా హాజరవడం వల్ల పెద్దగా ఫలితాలు వచ్చే అవకాశం లేదు.
దేశం నుంచి వెళ్లిన ప్రముఖులు..


మోడీ ప్రభుత్వం తరఫున ముగ్గురు కేంద్ర మంత్రులు సదస్సుకు వెళ్లారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవియా, కేంద్ర పెట్రోలియం మంత్రి హర్​దీప్ పూరి వరల్డ్​ఎకనామిక్​ఫోరం సదస్సులో పాల్గొన్నారు. వీరితోపాటు దేశం నుంచి దాదాపు100 మంది వ్యాపార ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి వెళ్లారు. ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ ఈ సదస్సులో పాల్గొనడం వల్ల వ్యాపారం,పెట్టుబడులకు ఆకర్షణీయమైన కేంద్రంగా దేశాన్ని చూపగలుగుతుందని పీయూష్​గోయల్​ఆశాభావం వ్యక్తం చేశారు.

శోభనా కామినేని, గౌతమ్ అదానీ, సంజీవ్ బజాజ్, హరి ఎస్ భారతియా, శ్యామ్ సుందర్ భారతియా, కుమార్ మంగళం బిర్లా, రాజన్ మిట్టల్, సునీల్ మిట్టల్, పవన్ ముంజాల్ లాంటి ఇండియన్​వ్యాపారవేత్తలు కూడా దావోస్​సదస్సులో ఉన్నారు. అయితే ఉక్రెయిన్ సంఘర్షణ, వాతావరణ మార్పులు, కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచాన్ని సిద్ధం చేయడం వంటి అంశాలు దావోస్‌‌‌‌లో చర్చలు, పెట్టుబడుల ఆసక్తిపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి. గతంతో పోలిస్తే ఈసారి పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించి దేశంలోని ఆయా రాష్ట్రాల నుంచి ఎక్కువ ఫోర్స్​కనిపించింది.
దావోస్‌‌‌‌లో జగన్, కేటీఆర్


దావోస్‌‌‌‌లో పాల్గొన్న ప్రముఖ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఉన్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, తెలంగాణ సీఎం కేసీఆర్​తనయుడు కేటీఆర్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే ఆయా రాష్ట్రాల తరఫున సదస్సులో పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నించారు. తెలంగాణను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేందుకు ప్రయత్నించిన కేటీఆర్.. సదస్సులో పలువురు వ్యాపారవేత్తలతో చర్చలు జరిపారు.

మరోవైపు కర్నాటక సీఎం బసవరాజ్​బొమ్మై కూడా కర్నాటకలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్​ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది. ప్రపంచ కంపెనీలకు ఇదొక గమ్యస్థానంలా మారింది. అయితే అది టీఆర్ఎస్​ప్రభుత్వం ఘనతేమీ కాదు. ఆ విషయానికొస్తే ఏ కోశాన కేటీఆర్​కూడా అందుకు చేసిందీమీ లేదు. హైదరాబాద్ లొకేషన్, వాతావరణం, కనెక్టివిటీ లాంటి సహజ పరిస్థితుల వల్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. అందుకే ప్రపంచ కంపెనీలు వాటి ప్రధాన కార్యాలయాలను ఇక్కడ స్థాపిస్తున్నాయి. 
ఏపీకి పెట్టుబడుల తిప్పలు
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే 2014లో రాష్ట్ర విభజన తర్వాత దాని పరిస్థితి అంతా బాగా లేదు. విభజన సమయంలో ఏపీ విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉంటే, తెలంగాణలో విద్యుత్ లోటు రాష్ట్రంగా ఉండేది. ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఏపీలో ఇప్పుడు కరెంట్​కోతలు కొనసాగుతుంటే.. తెలంగాణ విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్ తన విద్యుత్ పరిస్థితిని మెరుగుపరుచుకునే వరకు పెట్టుబడిదారులను ఆకర్షించగలదని ఆశించలేం. పైగా తెలంగాణతో పోలిస్తే ఏపీకి సులువైన కనెక్టివిటీ లేదు. కనెక్టివిటీ అనేది పెట్టుబడిదారుల సౌకర్యం కోసం మాత్రమే కాకుండా, తయారైన ఆయా వస్తువులు, ఉత్పత్తులను తరలించడానికి కూడా అవసరం. కనెక్టివిటీ సమస్యను అధిగమించడానికి ఏపీ కృషి చేయాలి. వస్తువుల తరలింపు, ఎగుమతుల కోసం ఓడరేవు లాంటి వ్యూహాలపై దృష్టి పెట్టాలి. 
ఏపీ, అదానీ గ్రీన్ ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదానీ గ్రీన్ ఎనర్జీ మధ్య రూ.60 వేల కోట్లకు అవగాహన ఒప్పందం(ఎంఓయు) కుదిరింది. అదానీతో ఎంఓయూ కుదుర్చుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి దావోస్ దాకా వెళ్లాలా? అనేది ఇక్కడ ప్రశ్న. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)పై దృష్టి సారించి విశాఖపట్నంను టెక్నాలజీ హబ్‌‌‌‌గా అభివృద్ధి చేయాలని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారని, ఆ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు సమాచారం. డస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జెలెన్ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చలు జరిపారు. దావోస్ సమ్మిట్‌‌‌‌కు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు మూడుసార్లు వెళ్లారు. ఆయన పదవీ కాలం ముగిసే సమయానికి లోకేష్ కూడా దావోస్‌‌‌‌లో పర్యటించారు. ఒకసారి ‘ఫ్యూచర్ ఆఫ్ అర్బన్ డెవలప్‌‌‌‌మెంట్’ అనే సెషన్‌‌‌‌కు హాజరైన చంద్రబాబు నాయుడు.. అక్కడ ఆంధ్రప్రదేశ్‌‌‌‌పై తన విజన్, నిర్దేశించుకున్న లక్ష్యాల గురించి వివరించారు. విశాఖపట్నంలోనూ ఆయన 2017 జనవరిలో రెండు రోజుల ఏపీ సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా 22.34 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉన్న రూ.10.54 లక్షల కోట్ల విలువైన 665 అవగాహన ఒప్పందాలపై  సంతకాలు జరిగాయి. అయితే ఇన్ని జరిగినా.. ఆ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడి ఎంతా అన్నదే ప్రధాన ప్రశ్న. విస్తృత పరస్పర చర్యలకు దావోస్  పరిమిత విలువను మాత్రమే కలిగి ఉంటుంది. ఇది ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఎటువంటి పరిష్కారాలను అందించలేదు. ఇబ్బందులను సరిదిద్దడంతోపాటు పెట్టుబడుల ప్రవాహానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు బలమైన రాజకీయ సంకల్పం అవసరం.
పారిశ్రామిక ప్రోత్సాహకాలు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఆమోదించే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం చెప్పింది. కానీ అలా జరగలేదు. వాస్తవానికి వైఎస్​జగన్​మోహన్​రెడ్డి కూడా అదే హామీతో అధికారంలోకి వచ్చారు. 25 మంది ఎంపీలను ఇస్తే ఆంధ్రప్రదేశ్‌‌‌‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తానని ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చారు. జగన్​మాటలు నమ్మిన ప్రజలు 2019లో వైఎస్సార్‌‌‌‌సీపీకి చెందిన 25 మంది ఎంపీలను గెలిపించారు. కానీ జగన్ మోహన్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదు సరికదా ప్రత్యేక హోదా గురించి కూడా ప్రస్తావించలేదు. ఇచ్చిన హామీని ఆయన విస్మరించారు. పెట్టుబడుల పరంగా ఆంధ్రప్రదేశ్‌‌‌‌కి ప్రత్యేక హోదా ఒక్కటే పరిష్కారం. ఎందుకంటే దాని వల్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందుతాయి. ఇది రాష్ట్రానికి పెట్టుబడిదారులను ఆకర్షించడంలో మేలు చేస్తుంది.  - పర్సా వెంకట్, పొలిటికల్​ ఎనలిస్ట్

 

ఇవి కూడా చదవండి

వేసవి అయిపోతుంది.. బడులు ఇంకెప్పుడు బాగుచేస్తరు?

కేర్ తీసుకోకపోతే పిల్లల్లో స్కిన్ ప్రాబ్లమ్స్

తరగని ఆస్తినంతా దానం చేసి ఏం చేస్తున్నారంటే..

బీటెక్ వాళ్లు కూడా సోషల్ సైన్స్ చదవొచ్చు