హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. నిండు కుండలా హుస్సేన్ సాగర్.. ఫుల్ కెపాసిటీకి దగ్గర్లో..

హైదరాబాద్లో దంచికొట్టిన వాన..  నిండు కుండలా హుస్సేన్ సాగర్.. ఫుల్ కెపాసిటీకి దగ్గర్లో..

హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. ఆకాశానికి చిల్లు పడింది అన్నట్లుగా కుండపోతగా వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ చెరువుల మాదిరిగా కనిపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ఇళ్లల్లోకి నీళ్లు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గరయ్యారు. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 

బంజారా హిల్స్, పికెట్, కూకట్ పల్లి నాళాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వస్తున్న  వరద కారణంగా సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ లో నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరుకుంది. హుస్సేన్ సాగర్ ప్రస్తుత  నీటి మట్టం 513.38 మీటర్లకు చేరుకుంది. దీంతో నిండుకుండలా మారింది.

హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లే. ఇవాళ(శుక్రవారం జులై 18)  కురిసిన వర్షానికి దాదాపు నిండిపోయింది. ఫుల్ కెపాసిటీకి రావడానికి కేవలం 0.3 మీటర్లే ఉంది. దీంతో మరికొద్ది సేపట్లో పూర్తిగా నిండిపోతుందని అధికారులు చెబుతున్నారు. 

భారీగా వరద నీరు చేరటంతో నిండుకుండలా ప్రమాదకరంగా సాగర్ మారిపోయింది. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు నీళ్లను తూముల ద్వారా మూసీ నదిలోకి వదులుతున్నారు అధికారులు. 

బోయిన్ పల్లిలో అత్యధిక వర్షపాతం:

హైదరాబాద్ లో దాదాపు మూడు గంటలు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. బోయిన్ పల్లిలో అత్యధికగా 9.3 సెం.మీ. వర్షం నమోదైంది. బండ్లగూడలో 9.18 సెంమీ వర్షం కురిసింది. 11 ప్రాంతాల్లో 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. మారేడ్ పల్లిలో 7.6 సెంటీమీటర్లు, మల్కాజ్ గిరిలో 7.35 సెంటీమీటర్లు, ఉప్పల్ లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్, బండ్లగూడ, బాలానగర్, అంబర్ పేట్, సైదాబాద్ ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. హయత్ నగర్, హిమాయత్ నగర్, బండ్లగూడ ప్రాంతాల్లో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

సికింద్రాబాద్లో చెరువులైన కాలనీలు:

శుక్రవారం ( జులై 18 ) సాయంత్రం కురిసిన వర్షం హైదరాబాద్ ను ముంచేసింది.. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో వరదనీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. చాలా చోట్ల జనం ట్రాఫిక్ జామ్ తో నరకయాతన యాతన పడ్డారు. ఈ క్రమంలో సుమారు గంటపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి సికింద్రాబాద్ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది..గాలి దుమారంతో చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు.

వర్షం ఏకాదటిగా కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి.. చాలా ప్రాంతాల్లో చెరువులను తలపించేలా  రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది... స్కూలు వదిలి పెట్టే సమయం కావడంతో ఒకసారిగా వచ్చిన వరదనీటి ఉధృతికి  విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.. సికింద్రాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ సమీపంలో  వరద నీరు మోకాళ్ళ లోతుకుపైగా చేరుకుంది. దీంతో విద్యార్థులను బయటికి రానివ్వలేదు స్కూల్ యాజమాన్యం. విద్యార్థులు తల్లిదండ్రులు, ఆటోడ్రైవర్లు విద్యార్థులను దగ్గరుండి తీసుకెళ్లారు... మోకాళ్ళ లోతు వరద నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు వర్ణాతీతంగా మారాయి.