
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలకు బస్తీలలోని నాలాలు నిండిపోతున్నాయి. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం కాలనీ, చింతల్, గణేష్ నగర్ కాలనీలలోని ఇళ్లలో వరద నీరు చేరింది. మోకాలి లోతు నీరు నిలవడంతో, ఇంట్లో ఉండేందుకు కూడా కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం కాలనీ, చింతల్, గణేష్ నగర్ కాలనీలలోని ఇళ్లలోకి వరద నీరు pic.twitter.com/fJRV5moiM5
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) July 18, 2025
ఇళ్లలోకి నీరు చేరి, వంట సామాను, పడక మంచాలు తడిసి పోవడంతో రాత్రంతా వరద నీటిలో ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరో పక్క బహదూర్ పల్లి నుంచి బాలానగర్ వెళ్లే రహదారి.. సూరారం మెయిన్ రోడ్డు దగ్గర వరద నీరు నిలవడంతో ట్రాఫిక్ కిలోమీటర్ మేర స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు వర్షంలో కూడా తడుస్తూ వేరే రూట్లకు ట్రాఫిక్ను మళ్లించి వరద నీరు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. నల్లకుంట పద్మ కాలనీలోని నాలాలో ప్రవహిస్తున్న నీళ్ల తాకిడికి నాలాపై నిర్మించిన గోడ కూలిపోయింది. నాలాకు అనుకుని కొన్ని ఇళ్ళు ఉండడంతో అక్కడ నివసిస్తున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు అక్కడ అనుకుని ఉన్న ఇళ్ల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు.
హైదరాబాద్ సిటీ వర్షం లేటెస్ట్ అప్డేట్స్:
* హైదరాబాద్లో దంచికొట్టిన వాన
* లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
* రోడ్లపై నిలిచిపోయిన వరదనీరు.. ట్రాఫిక్ జామ్.. రాకపోకలకు ఇబ్బందులు
* హైదరాబాద్ సిటీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
* ఈ రాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం
* శుక్రవారం సాయంత్రం నగరంలో రెండు గంటల పాటు కురిసిన వర్షానికి అతలాకుతలమైన ఐటీ కారిడార్
* కొండాపూర్, ఐకియా, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్‌లో భారీగా ట్రాఫిక్ జాం
* రోడ్లపైకి భారీగా వచ్చి చేరిన వరద నీరు
హైదరాబాద్ సిటీలో రాత్రి 8 గంటల వరకు నమోదైన వర్షపాత వివరాలు:
* కంటోన్మెంట్ ఏరియాలో అత్యధికంగా 11.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
* బోయిన్ పల్లిలో 11.45 సెంటీమీటర్లు
* నాచారంలో 10.13 సెంటీమీటర్లు
* మూసారం బాగ్లో 9.85 సెంటీమీటర్లు
* అడ్డగుట్టలో 9.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న హుస్సేన్ సాగర్
* హుస్సేన్ సాగర్లోకి భారీగా చేరిన వరద నీరు
* ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకున్న హుస్సేన్ సాగర్ నీటి మట్టం
* 513.41 మీటర్ల వద్ద ఫుల్ ట్యాంక్ లెవెల్.. ప్రస్తుతం 513.38 మీటర్లు