
న్యూఢిల్లీ:పది లక్షల మందికి ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో శిక్షణ ఇస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. డిజిటల్ ఇండియా 10 ఏళ్ల వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ) దివస్ 2025 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. “దేశవ్యాప్తంగా విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (వీఎల్‌ఈల) డిజిటల్ ఇండియా ప్రయోజనాలను ప్రతి పౌరుడికి అందిస్తున్నారు.
అద్భుత ఉదాహరణగా నిలిచారు. టీ అమ్మేవారు, కూరగాయల వ్యాపారి డిజిటల్ పేమెంట్లను ఉపయోగించగలరా? అని ప్రపంచం సందేహించినప్పుడు, యూపీఐ వారి ఆలోచనలను మార్చేసింది” అని వైష్ణవ్ అన్నారు. ఏఐతో ప్రజల జీవితాలను మెరుగపరచాలని, వ్యవసాయం, ఆరోగ్యం, విద్యలో దీని వాడకాన్ని పెంచాలని అన్నారు. 2009లో సీఎస్‌సీ ఎస్‌పీవీ ఏర్పాటయ్యింది. దేశం మొత్తం మీద 5.5 లక్షల కేంద్రాలతో ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ సర్వీస్‌లను అందించే ఎకోసిస్టమ్‌గా ఎదిగింది. వీఎల్‌ఈలు ఆధార్, పాన్ కార్డ్, బ్యాంకింగ్, టెలిమెడిసిన్, విద్య, నైపుణ్య శిక్షణ, గ్రామీణ ఈ-–స్టోర్, బిల్ చెల్లింపులు వంటి సేవలను అందిస్తున్నారు. 2014లో కేవలం 83 వేల సీఎస్‌సీ కేంద్రాలు ఉండగా, ఇప్పుడు 5.5 లక్షలకు ఇవి చేరాయి.
ఒడిశా మయూర్‌భంజ్‌కు చెందిన మంజులత, మేఘాలయకు చెందిన రోజ్ ఏంజెలినా వంటి వీఎల్‌ఈల ప్రేరణాత్మక కథలను వైష్ణవ్ హైలైట్ చేశారు. సీఎస్‌సీలు దేశంలోని 90 శాతం గ్రామాలకు చేరాయని, ఐఆర్‌సీటీసీ సర్వీసులను వీఎల్‌ఈలు అందించాలని, రాష్ట్ర ఐటీ ఏజెన్సీలతో సీఎస్‌సీ ఎస్‌పీవీని సమన్వయం చేయడానికి ముఖ్యమంత్రులతో చర్చిస్తానని చెప్పారు. సీఎస్‌సీ దివస్ ఈ నెల15-–16న ఢిల్లీలో, జులై 1-–15 మధ్య దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరిగింది.