పెళ్లికి ముందే అన్నీ చేసి.. పెళ్లికి జాతకం బాగోలేదంటే కుదరదు : ఆసక్తి రేపుతున్న హైకోర్టు వ్యాఖ్యలు

పెళ్లికి ముందే అన్నీ చేసి.. పెళ్లికి జాతకం బాగోలేదంటే కుదరదు : ఆసక్తి రేపుతున్న హైకోర్టు వ్యాఖ్యలు

పెళ్లి అంటేనే అటు అమ్మాయి తరుపున ఇటు అబ్బాయి తరుపున అన్ని కుదిరాకే ముహూర్తం పెట్టుకుంటారు. ఎందుకంటే పెళ్లి అంటేనే నూరేళ్ళ పంట... అలాంటిది పెళ్లి చేసుకుంటాను అనే ఒక్క మాటతో ఓ మహిళను ఏళ్ల తరబడి మోసం చేసుకుంటూ వచ్చాడు ఓ వ్యక్తి.  

పెళ్లి చేసుకుంటానని నమ్మించడమే కాకుండా, శారీరక సంబంధం పెట్టుకొని.. చివరి నిమిషంలో జాతకాలు కలవడం లేదు అనే సాకుతో పెళ్లికి  నిరాకరించాడు ఆ వ్యక్తి. దింతో ఆ మహిళా కోర్టుని ఆశ్రయించింది. పెళ్లి పేరుతో నమ్మించి, మహిళని లోబర్చుకోవడమే కాకుండా జాతకాల పేరుతో పెళ్లికి నిరాకరించడం అనేది నేరమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కారణంతో ఆ వ్యక్తి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

వివరాల్లోకి వెళితే... ఓ వ్యక్తి ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెతో 8 ఏళ్లుగా సన్నిహితంగా ఉన్నాడు. తీరా పెళ్లి సమయానికి జాతకాలు కలవడం లేదంటూ ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. దింతో ఆ మహిళా అతని పై కేసు పెట్టి  కోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఆ వ్యక్తి తరపు లాయర్ వాదిస్తూ..  వారిద్దరి మధ్య సంబంధం ఇష్టపూర్వకంగానే జరిగింది, ఇది అత్యాచారం కిందకు రాదు అని బెయిల్ కోరారు.

కోర్టు ఏమన్నదంటే :
జాతకాలు కలవవని తెలిసినా లేదా జాతకాల విషయంపై పట్టుబట్టాలని ముందే అనుకున్నా.. పెళ్లి చేసుకుంటానని పదే పదే హామీ ఇవ్వడం తప్పు. ఇది కేవలం ఒక ప్రేమ విఫలం కాదని, మోసం చేయడమేనని కోర్టు అభిప్రాయపడింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 69 ప్రకారం.. పెళ్లి చేసుకుంటానని అబద్ధపు హామీ ఇచ్చి మహిళతో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం. జాతకం కుదరలేదనే సాకు చెప్పడం కూడా ఈ నేరం కిందకే వస్తుందని జస్టిస్ స్వర్ణ కాంత శర్మ పేర్కొన్నారు.

అయితే ఆ వ్యక్తి ఈ ఏడాది జనవరి నుంచి జైల్లో ఉన్నాడు. కేసు విచారణ ఇంకా పూర్తి కానందున, ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో కోర్టు అతనికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. పెళ్లి సంబంధం విఫలమైన ప్రతిసారీ క్రిమినల్ కేసులు పెట్టలేము కానీ, పెళ్లి చేసుకుంటానని గట్టిగా నమ్మించి, చివరి నిమిషంలో ఇలాంటి సాకులు చెప్పడం మహిళను మోసం చేయడమేనని కోర్టు తేల్చి చెప్పింది.