క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) ఏర్పాటు ద్వారా డెల్టా సిస్టమ్‌లో 15.78 టీఎంసీల జలాలు ఆదా అవుతాయన్న తెలంగాణ వాదనల్లో వాస్తవం లేదని, రాజధాని ఏర్పాటు వల్ల వ్యవసాయ భూములు పోతాయన్న తెలంగాణ వాదనలు తప్పు అని ఏపీ వాదించింది. రాజధాని ప్లాన్ అనేది కేవలం ముసాయిదానేనని, అది నిజం కావడానికి వందేండ్లయినా పట్టే అవకాశాలున్నాయని పేర్కొంది.
ముసాయిదాను ఇంకా గెజిట్ చేయలేదని, రాజధాని నగరానికి, రాజధాని ప్రాంతానికి చాలా తేడా ఉందని వాదించింది. మంగళవారం కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 (బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్) ముందు ఏపీ తన వాదనలను కొనసాగించింది. రాజధాని నగరం కొంచెమైనా కృష్ణా డెల్టా ఆయకట్టులో లేదని వాదించింది. 53,600 ఎకరాల రాజధాని ప్రాంతంలో కేవలం 891 ఎకరాలే వైకుంఠపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఉన్నదని, ఇప్పుడు ఆ స్కీమ్ కూడా పనిచేయడం లేదని పేర్కొంది. తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం 15.78 టీఎంసీలు ఆదా అవుతాయన్నది సరికాదని తెలిపింది.
పట్టిసీమ తాత్కాలికమే
పట్టిసీమ లిఫ్ట్ స్కీమ్ తాత్కాలికమేనని, పోలవరం ప్రాజెక్ట్ పూర్తికాకపోవడంతో గోదావరి వరద జలాలను కృష్ణా డెల్టా సిస్టమ్‌కు తరలించేందుకు చేపట్టిన ప్రాజెక్ట్ అని ఏపీ వాదించింది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తికాగానే పట్టిసీమను పక్కనపెడతామని తెలిపింది. పట్టిసీమకు ప్రత్యేకంగా కెనాల్ సిస్టమ్ ఏదీ లేదని తెలిపింది. పట్టిసీమ నెట్ వర్క్‌ను విస్తరించి 80 టీఎంసీల కన్నా ఎక్కువగా ఏపీ తరలిస్తున్నదని తెలంగాణ వాదిస్తున్నదాంట్లో నిజం లేదని పేర్కొంది.
పోలవరం పూర్తయితే.. ఇటు పోలవరం, అటు పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకెళ్తామన్న తెలంగాణ వాదనలు అసంబద్ధమని వాదించింది. డెల్టాకు తరలిస్తున్న 80 టీఎంసీల్లో 45 టీఎంసీలు తెలంగాణ, ఏపీలకు ఇచ్చే అంశం కృష్ణా ట్రిబ్యునల్ పరిధిలో లేదని, అది గోదావరి ట్రిబ్యునలే తేల్చాలని అడ్డంగా వాదించింది. కృష్ణా డెల్టాకు 152.2 టీఎంసీలు అవసరమని, గోదావరి నుంచి 80 టీఎంసీలు తరలించగా మిగిలిన మొత్తాన్ని కృష్ణా నది నుంచి తీసుకెళ్తామని తెలిపింది.
పులిచింతలకు దిగువన 53 టీఎంసీల జలాలు ఉన్నాయని, కృష్ణా కేటాయింపుల్లోని 2,130 టీఎంసీల్లో అవి కూడా భాగమని వాదించింది. డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా వచ్చే 42.53 టీఎంసీలు వాడుకోవడానికి అనువుగా ఉండవని పేర్కొంది. దాంట్లో లవణీయత, పురుగుమందు అవశేషాలు, మురుగు అన్ని కలిసి వస్తాయని వాదించింది.
