బిర్యానీకి ఆశపడి అన్నం పోగొట్టుకుండ్రు... ఇప్పుడు ఐదేండ్లు శిక్ష అనుభవిస్తుండ్రు: కేటీఆర్

బిర్యానీకి ఆశపడి అన్నం పోగొట్టుకుండ్రు... ఇప్పుడు ఐదేండ్లు శిక్ష అనుభవిస్తుండ్రు: కేటీఆర్
  • బీఆర్ఎస్ ను ఓడగొట్టి తప్పు చేసినమని బాధపడుతుండ్రు
  • నాయకుడి విలువ తెలువాలంటే ప్రతినాయకుడు ఉండాలె
  • కాంగ్రెస్ ను  గెలిపించడం జనం తెప్పేనని కేటీఆర్ శాపనార్థాలు

హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీ బిర్యానీ పెడ్తదని ఆశపడి కేసీఆర్ పెట్టే అన్నం పోగొట్టుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ను ఓడించి తప్పు చేశామని బాధపడుతున్నారని, నాయకుడి విలువ తెలియాలంటే ప్రతినాయకుడు ఉండాలని అన్నారు. ఇవాళ ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ను ఓడించినందుకు ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. మన దేశంలో రీకాల్ వ్యవస్థ లేదని, రేవంత్ లాంటి మోసగించే నేతలుంటారని ఆనాడు అంబేద్కర్ ఊహించలేదని, అందుకే రాజ్యాంగంలో రీకాల్ అనేది పెట్టలేదని అన్నారు. 

గుర్రం విలువ తెలియాలంటే గాడిద ఉండాలని, కేసీఆర్ అన్నం పెడుతుంటే రేవంత్ బిర్యానీ పెడతాడనుకొని ప్రజలు ఓట్లేశారని, కానీ మోసం చేశాడని అన్నారు. కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నట్టుగా భావించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలను నమ్మి ఓట్లేస్తే మోసం చేశారని ఆరోపించారు. సరైన నాయకత్వం ఉంటేనే పాలన సజావుగా పాలన సాగుతుందని, ఎవరిని పడితే వారిని గెలిపిస్తే ఇట్లాగే మోసపోతామని అన్నారు.  

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి వంద సీట్లు పక్కాగా వస్తాయని చెప్పారు. ఖమ్మంలో ఎన్నికలు పెడితే అన్నీ సీట్లలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని, పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయాలని అన్నారు. 

పొంగులేటి కాదు బాంబులేటి

మంత్రి పొంగులేటి దీపావళికి ముందే బాంబులు పేల్తయని చెప్పారని, ఇంకా పేలడం లేదని, ఆయన పొంగులేటి కాదు .. బాంబులేటి అయ్యారని అన్నారు.  ఎరువుల కరువుతో రైతులు అల్లాడుతుంటే ఖమ్మం జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల పట్టించుకోవడం లేదని అన్నారు.