
హైదరాబాద్ లో శుక్రవారం ( జులై 18 ) సాయంత్రం ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది.. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి.చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో జనం నరకం అనుభవించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లోని చాలా కాలనీలోకి భారీగా వరదనీరు వచ్చి చేరటంతో జనం తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఇదిలా ఉండగా.. GHMC హెడ్ ఆఫీసు పరిస్థితి మరీ అధ్వానంగా తయారయ్యింది. ఇవాళ కురిసిన వర్షానికి హెడ్ ఆఫీసులో సీలింగ్ నుంచి పిల్లర్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ కి వర్షపు నీరు వచ్చి చేరింది.
ఇటీవల కురిసిన వర్షానికి ఇన్ వార్డ్స్ సెక్షన్ లో వర్షపు నీరు చేరి కంప్యూటర్లు పాడవ్వగా.. ఇవాళ కురిసిన వర్షానికి పిల్లర్ ద్వారా వర్షపు నీరు గ్రౌండ్ ఫ్లోర్ కి చేరుకుంది. దీంతో అటు ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఫాల్ సీలింగ్ పదవుతుండటంతో ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు ఉద్యోగులు. హైదరాబాద్ లాంటి మహానగరంలో నగరపాలక సంస్థ హెడ్ ఆఫీసులోనే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు జనం.
ఇదిలా ఉండగా.. ఇవాళ కురిసిన భారీ వర్షానికి మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి ఐకియా మార్గంలో ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు నానా యాతన పడ్డారు. హైటెక్ సిటీ నుంచి KPHB మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మియాపూర్ నుంచి గచ్చిబౌలి, గచ్చిబౌలి నుంచి మియాపూర్ మార్గంలో వరద నీరు రోడ్డు పైకి రావడంతో ట్రాఫిక్ జాం అయి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. హైదరాబాద్లో వర్షం పడిన ప్రతీసారి గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఏరియాల్లో వాహనదారులు ట్రాఫిక్ జాం కారణంగా నరకం చూస్తున్నారు.