
Market Crash: ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్లు చివరి ట్రేడింగ్ రోజుల భారీగా నష్టాల్లోకి జారుకున్నాయి. గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లలో కూడా సూచీలు నష్టాలను చూస్తున్నాయి. అసలు మార్కెట్ల నష్టాలకు కారణం ఏంటి.. పెట్టుబడిదారులను కంగారు పెడుతున్న అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తవానికి ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో పాటు విదేశీ పెట్టుబడులు భారతీయ మార్కెట్ల నుంచి తరలిపోవటం వంటి అంశాలు మార్కెట్లను నష్టాల్లోకి నెట్టేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం 2.57 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 520 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 145 పాయింట్లు కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా నష్టాల్లోనే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
Also Read:-లోన్లు తీసుకునే వారికి గుడ్న్యూస్..తగ్గనున్న గృహ, వాహన, వ్యక్తిగత రుణాల వడ్డీరేట్లు!
తాజాగా ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ యాక్సిస్ బ్యాంక్ విడుదల చేసిన నిరాశాజనకమైన ఫలితాలతో మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లు దెబ్బతిన్నాయి. దీంతో యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, కోటక్ మహీంద్రా వంటి బ్యాంకింగ్ స్టాక్స్ కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. విదేశీ మదపరులు చైనా సహా ఇతర మార్కెట్లలో ఆకర్షనీయమైన పెట్టుబడి అవకాశాలతో దేశీయ మార్కెట్లను వీడటం నష్టాలకో మరో కారణం అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వికే విజయకుమార్ చెప్పారు. మార్కెట్ల పతనానికి మరో కారణం పెరిగిన వోలటాలిటీ ఇండెక్స్ కూడా అని తేలింది.
ప్రస్తుతం లిస్టెడ్ కార్పొరేట్ కంపెనీలు తన త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తున్న వేళ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆశించిన స్థాయిలో కంపెనీల పనితీరు లేకపోవటంతో వేచి చూసే ధోరణిని ప్రస్తుతం వారు కొనసాగిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.