ఇండ్లన్నీ చెరువులై.. దారులన్నీ వాగులై.. జలదిగ్బంధంలో కొంగరకలాన్.. రాకపోకలు బంద్ !

ఇండ్లన్నీ చెరువులై.. దారులన్నీ వాగులై.. జలదిగ్బంధంలో కొంగరకలాన్..  రాకపోకలు బంద్ !

భారీ వర్షాలకు తెలంగాణలో పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న కొంగరకలాన్ నీటిలో మునిగిపోయింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న కొంగరకాలన్ కు రాకపోకలు బందయ్యాయంటే వర్షం ఎంతమేరకు కురిసిందో అంచనా వేయవచ్చు. 

శుక్రవారం (జులై 18) రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల మున్సిపల్ పరిధిలో కొంగర కాలన్  భారీ వర్షంలో తడిసిముద్దయ్యింది. 8 సెంటర్ల వర్షపాతం నమోదు  కావడంతో కాలనీలన్నీ చెరువులను తలపించాయి. వర్షానికి ఇండ్ల లోకి 3 ఫీట్ల మేరకు వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బురద నీరు భారీగా వచ్చి చేరడంతో బయటకు ఎత్తి పోస్తున్నారు. బియ్యం, కూరగాయలు, బట్టలు.. ఇతర సామాగ్రి తడిసిపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 

ఉగ్రరూపం దాల్చిన ధాతర్ చెరువు వాగు :

కొంగర కాలన్ నుండి ఎలిమినేడు వెళ్ళే రహదారి వద్ద ధాతర్ చెరువు వ వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో  రహదారిపై రాకపోకలు బంధయ్యాయి. సుమారు 2గంటల పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. ధాతర్ చెరువు వాగు ఉదృతి మరింత పెరిగితే రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. 

వర్షం నిలిచినప్పటికీ వాగు ఉధృతి తగ్గలేదు. పైనుంచి వాగులో వరద నీరు కలుస్తుండటంతో వాగు భయంకరంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామస్తులు గ్రామంవైపు.. బయటికి వెళ్లినవాళ్లు బయటనే చిక్కుకున్నారు. వాగు ఉధృతి తగ్గితే వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏటా వర్షా కాలంలో ఇదే పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగు మీద బ్రిడ్జి నీ నిర్మించాలని స్థానికులు గత కొన్నేళ్లుగా కోరుతున్నారు.