
- ఇందిరా మహిళా డెయిరీ స్కీమ్ కింద ఎంపిక చేసిన మహిళలకు రెండు గేదెల చొప్పున పంపిణీ
- పైలెట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా
- మధిర నియోజకవర్గంలో షురూ..
- 80 శాతం సబ్సిడీపై 125 యూనిట్ల గేదెల పంపిణీ
- తొలి విడతగా 5 మండలాల్లో 250 యూనిట్ల అందజేత
- 20 వేల మందికి 40 వేల గేదెల మంజూరు లక్ష్యం
ఖమ్మం/ ఎర్రుపాలెం, వెలుగు: ఖమ్మం జిల్లాలో ఇందిరా మహిళా డెయిరీ పథకం గ్రౌండింగ్ ప్రారంభమైంది. మధిర నియోజకవర్గంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు గేదెల పంపిణీని మొదలుపెట్టారు. జిల్లా పర్చేస్ కమిటీ ఆధ్వర్యంలో ఏపీ నుంచి కొనుగోలు చేసిన గేదెలను ముదిగొండ, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లో లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారురాలికి రూ.4 లక్షలు విలువ చేసే రెండు గేదెలను ఇస్తున్నారు.
ఒక్కో గేదెకు సబ్సిడీ కింద రూ.1.60 లక్షలు మినహాయించి, రూ.40 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని చెల్లించలేని వారికి బ్యాంకు ద్వారా రుణం ఇప్పిస్తున్నారు. పాలు అమ్మగా వచ్చిన లాభంతో ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మధిర నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాల్లోని 20 వేల మంది సభ్యులకు 40 వేల గేదెలను మంజూరు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందుగా నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో, మండలానికి 50 యూనిట్ల చొప్పున అందజేయాలని నిర్ణయించారు.
విడతల వారీగా అమలు..
మధిర నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక సంఘాల్లో దాదాపు 62 వేల మంది ఉండగా, వీరిలో 20 వేల మంది ఇందిరా మహిళా డెయిరీలో రూ.2,100 చొప్పున చెల్లించి సభ్యులుగా చేరారు. ఈ 20 వేల మందికి విడతల వారీగా 40 వేల గేదెలను సబ్సిడీపై మంజూరు చేసేందుకు జిల్లా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు మొదటి ప్రాధాన్యతనిస్తున్నారు.
ఇప్పటికే సొంతంగా ఒక గేదె ఉన్న వారిని గుర్తించి, రెండ్రోజులుగా 125 మంది లబ్ధిదారులకు 250 గేదెలు పంపిణీ చేశారు. ఎర్రుపాలెంలో ఏడాది కింద 5 వేల లీటర్ల కెపాసిటీ కలిగిన బల్క్ మిల్క్ చిల్లింగ్(బీఎంసీ)యూనిట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఇక్కడికి రోజుకు 2 వేల లీటర్ల వరకు పాలను మహిళలు సప్లై చేస్తున్నారు. బోనకల్, ముదిగొండలో బీఎంసీ యూనిట్లను పాల సేకరణకు సిద్ధం చేశారు.
మిగిలిన రెండు మండల కేంద్రాల్లోనూ త్వరలోనే యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. మధిర నియోజకవర్గంలో విడతల వారీగా 132 గ్రామాల్లో పాల సేకరణ చేపట్టనున్నారు. పూర్తి స్థాయిలో డెయిరీ నిర్మాణం కోసం బోనకల్ లో 9.5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ పాల ప్యాకెట్లతో పాటు బై ప్రొడక్ట్స్‌ను తయారు చేసే ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా..
ప్రస్తుతం మహిళలకు 80 శాతం సబ్సిడీపై గేదెలను అందిస్తుండగా, దాణాను 50 శాతం సబ్సిడీపై సప్లైచేస్తున్నారు. భవిష్యత్ లో గడ్డి పెంచేలా రైతులను ప్రోత్సహించడంతో పాటు నిరుద్యోగులకు పశువుల దాణా తయారీ, ప్యాకింగ్, సరఫరా యూనిట్లు, రిటెయిల్ గా పాల ఉత్పత్తుల అమ్మకం ద్వారా ఉపాధి కల్పించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
మధిర నియోజకవర్గంలో ఈ స్కీమ్ సక్సెస్ అయితే ఇందిరా మహిళా డెయిరీని రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాలకు క్రమంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2013లో ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పదకొండేళ్ల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తన సొంత నియోజకవర్గంలో ఈ స్కీమ్‌ను ప్రారంభించారు.
రూ.500 కోట్ల టర్నోవర్ సాధించేలా ప్లాన్
ఎంపిక చేసిన మహిళలకు రెండు గేదెల చొప్పున ఇందిరా మహిళా డెయిరీ స్కీమ్ కింద గ్రౌండింగ్ ప్రారంభమైంది. 20 వేల మంది లబ్ధిదారులకు గేదెల పంపిణీ పూర్తయితే రోజుకు 2.40 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి. వీటి ద్వారా నెలకు రూ.25 కోట్లకు పైగా మహిళలు సంపాదించే అవకాశం ఉంటుంది. పాలతో పాటు పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న, పన్నీర్, స్వీట్స్ వంటి ప్రొడక్ట్స్ తయారు చేయడం ద్వారా టర్నోవర్ రూ.500 కోట్లకు చేరుకునేలా ప్లాన్ చేస్తున్నాం. - అనుదీప్ దురిశెట్టి, కలెక్టర్
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది. మహిళలు పాడి పరిశ్రమపై దృష్టిసారించి, ఆదాయం పొందేలా ఇందిరా మహిళా డెయిరీని ఏర్పాటు చేస్తున్నాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు ఈ పథకం దోహదం చేస్తుంది. వ్యవసాయంతో పాటు పాడి ఆదాయం కలిస్తే రైతు కుటుంబాలు మరింత నిలదొక్కుకుంటాయి. 2013లో నాకు వచ్చిన ఈ ఆలోచనను క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు ఇప్పటికీ అవకాశం దొరికింది. - భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం
మా ఫ్యామిలీడెవలప్ అవుతుంది..
నాకు ఇప్పటికే రెండు గేదెలున్నాయి. రెండు గేదెలను ప్రభుత్వం అందించింది. మాకు ఉన్న ఎకరం భూమిలో పశువుల మేత పెంచుకుంటున్నాం. మా కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది.- మొండ్రు జయమ్మ, ఇనగాలి గ్రామం
సంతోషంగా ఉంది..
ఇందిరా మహిళా డెయిరీ స్కీమ్ కింద రెండు గేదెలు ఇచ్చారు. బ్యాంకులో రూ.40 వేలు కట్టగా, రూ.1.60 లక్షలు మాఫీ వచ్చిందని చెప్పారు. ఈ రెండు గేదెలు రోజుకు ఐదారు లీటర్ల పాలిస్తున్నాయి. మా కుటుంబానికి భరోసా చూపించిన రాష్ట్ర ప్రభుత్వానికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రుణపడి ఉంటాం.- ఇరుకు నాగమణి, ముదిగొండ