
నేటి తరం యువత తక్కువ కాలంలోనే ఎక్కువ రాబడిని అందించే మార్గాలను అన్వేషిస్తూ ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు. అయితే వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడులు మొదటిలో నెమ్మదిగా.. తర్వాత కాలం గడిచే కొద్ది వేగంగా పెరుగుతాయని. ప్రతి నెల రూ.30వేలు చొప్పున 12% వడ్డీ రేటుతో పెట్టుబడి పెడితే.. మొదటి రూ.50 లక్షలు సంపాదించటానికి 8 ఏళ్ల 3 నెలల సమయం పడుతుంది. దీని తర్వాత రూ.50 లక్షలు సంపాదించటానికి కేవలం 10 నెలలు సమయం పడుతుందని చాలా మందికి తెలియదు. అంతేగాక ఈ పెట్టుబడి వ్యూహాన్ని కొనసాగిస్తే వారు కోరుకున్న రూ.5 కోట్ల కార్పస్ చేరుకోవటం చాలా సులువు కూడా. ఇదంతా కాంపౌండింగ్ చేసే మాయ.
ప్రారంభ దశలో లాభాల కంటే పెట్టుబడిదారులే ఎక్కువగా వాటా పెట్టాల్సి ఉంటుంది. మొదటి రూ.50 లక్షల్లో 59% (రూ.29.5 లక్షలు) పెట్టుబడిదారుడి డబ్బు.. మిగిలిన 41% (రూ.20.5 లక్షలు) లాభాలు ఉంటాయి. రెండో రూ.50 లక్షల్లో మాత్రం 71% (రూ.35.5 లక్షలు) లాభాలతో వచ్చే డబ్బే కాగా.. కేవలం 29% మాత్రమే కొత్త పెట్టుబడిగానే ఇన్వెస్టర్ పెట్టాల్సి ఉంటుంది. ఇది కంపౌండింగ్ మహత్త్వాన్ని నొక్కి చెబుతుంది. బయటి నుంచి రావడం కన్నా పెరిగిన సంవృద్ధినుంచే సంపద జెట్ వేగంలో వృద్ధి చెందుతుందని చాలా మందికి తెలియదు.
కొత్త ఇన్వెస్టర్లు మెదడు మాటలు విని మెుదట్లో తక్కువగా వృద్ధి చూస్తూ నమ్మకం కోల్పోతారు. కానీ ఏడేళ్లు, పదేళ్ల తర్వాత వచ్చిన లాభాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అందుకే దీర్ఘకాలిక వ్యూహాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. తొలిదశలో చేసిన పెట్టుబడులే భవిష్యత్ ఆర్ధిక విజయానికి ఇంధనంగా పనిచేస్తాయి. ఇక్కడ 8-4-3 రూల్ అంటే మెుదటి రూ.50 లక్షలు కూడబెట్టడానికి 8 ఏళ్లు సమయం పడుతుండగా.. ఆ తర్వాతి రూ.50 లక్షల కోసం 4 ఏళ్లు సరిపోతుంది. ఆ తర్వాతి నుంచి ప్రతి మూడేళ్లకు రూ.50 లక్షల సంపద పెరుగుతూనే ఉంటుంది. ఇలా క్రమశిక్షణతో పెట్టుబడిదారులు ప్రతినెల రూ.30వేలు పెట్టుబడిని కొనసాగిస్తే 20వ ఏట నుంచి ప్రతి సంవత్సరం వారి సంపద విలువ రూ.50 లక్షల చొప్పున పెరుగుతుంటుంది.