Indian 3 Movie: 'భారతీయుడు 3'కు బ్రేక్ పడిందా? కమల్ హాసన్ అభిమానులకు షాక్!

Indian 3 Movie: 'భారతీయుడు 3'కు బ్రేక్ పడిందా? కమల్ హాసన్ అభిమానులకు షాక్!

లెజెండరీ నటుడు కమల్ హాసన్, దర్శక దిగ్గజం శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'భారతీయుడు 2' మూవీ గత ఏడాది రిలీజైన విషయం తెలిసిందే. 1996లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజై.. డిజాస్టర్ గా నిలిచింది.  అయితే, ఈ సినిమా ముగింపులో 'భారతీయుడు 3' ట్రైలర్ చూపించి, అభిమానులకు మరింత ఉత్సాహాన్ని అందించారు. పార్ట్ 2 డిజాస్టర్ అయినప్పటికీ, పార్ట్ 3 పై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. కానీ, గత కొంత కాలంగా ఈ ప్రాజెక్టుపై అనిశ్చితి నెలకొనడంతో అభిమానులలో ఆందోళన మొదలైంది.

ఈ సినిమా మొదట ఒక భాగంగా మాత్రమే ప్లాన్ చేశారు దర్శకుడు శంకర్. కానీ, కథ నిడివి ఎక్కువ కావడంతో దర్శకుడు శంకర్ దీనిని రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే, పార్ట్ 2 చివరిలో పార్ట్ 3 ట్రైలర్ చూపించి, ప్రేక్షకులను థియేటర్ల నుంచి ఆకర్షించారు. ట్రైలర్ అద్భుతంగా ఉన్నప్పటికీ, పార్ట్ 3 విడుదల అవుతుందో లేదో అనే సందేహాలు మొదలయ్యాయి.

మొదట, పార్ట్ 3 థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. కానీ దర్శకుడు శంకర్ ఈ వార్తలను ఖండించి, సినిమా థియేటర్లలోనే విడుదల అవుతుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత, పార్ట్ 3 షూటింగ్ పూర్తిగా రద్దయిందని, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని ఊహాగానాలు వినిపించాయి. ఈ వార్తలు కమల్ హాసన్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి.

ఆ తర్వాత, లైకా ప్రొడక్షన్స్ మళ్లీ 'భారతీయుడు 3'పై పనిచేయడం ప్రారంభిస్తుందని, రెడ్ జెయింట్ ప్రొడక్షన్స్ భాగస్వామిగా చేరుతుందని వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, లైకా , రెడ్ జెయింట్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం రద్దయినట్లు తెలుస్తోంది. దీంతో, 'భారతీయుడు 3' ప్రాజెక్టుకు పూర్తిగా బ్రేక్ పడిందని, ఈ సినిమా ఇక వచ్చే అవకాశం లేదని టాలీవుడ్, కోలీవుడ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే వరకు ఏదీ చెప్పలేం. కానీ ప్రస్తుతానికి, కమల్ హాసన్ ఫ్యాన్స్‌కి ఇది ఒక పెద్ద షాక్‌ అనే చెప్పాలి. ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.