
- ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్, డాలర్ వాల్యూ పడడమే కారణం
న్యూఢిల్లీ: గోల్డ్ ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలు, డాలర్ వాల్యూ పడుతుండడంతో దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు మంగళవారం రూ.1,800 పెరిగి 10 గ్రాములకు రూ.1,15,100కి చేరాయి. ఇది ఆల్ టైమ్ హై కావడం విశేషం. గత సెషన్‌లో 99.9శాతం ప్యూరిటీ గల గోల్డ్ రూ.1,13,300 గా రికార్డయ్యింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ (99.9శాతం) రేటు రూ.1,11,930 వద్ద ఉంది.
“యూఎస్ డాలర్ విలువ 10 వారాల కనిష్టానికి చేరడం, ఫెడ్ వడ్డీ తగ్గింపు అంచనాలు బంగారం ర్యాలీకి బలాన్నిస్తున్నాయి” అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ ఎనలిస్ట్ సౌమిల్ గాంధీ అన్నారు. వెండి ధరలు కూడా మంగళవారం రికార్డు స్థాయికి చేరాయి. రూ.570 పెరిగి కిలోకు రూ.1,32,870 లెవెల్‌ను టచ్ చేశాయి. హైదరాబాద్‌లో రూ.1,44,000 కి చేరాయి. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి పెంచడంతో ఈసారి రేట్ల తగ్గింపు ఖాయమని ట్రేడర్లు భావిస్తున్నారు. కాగా, ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే యూఎస్ బాండ్లలోకి వెళ్లే పెట్టుబడులు గోల్డ్ వంటి సేఫ్ అసెట్స్‌కి మారుతాయి. అదే డాలర్ విలువ పడితే గోల్డ్ కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో రేట్లు పెరుగుతాయి. బుధవారం ఫెడ్ మీటింగ్ వివరాలు బయటకు వస్తాయి.
డాలర్ విలువ పడడంతో..
మేజర్ కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ కదలికలను కొలిచే డాలర్ ఇండెక్స్ మంగళవారం 0.28శాతం తగ్గి 97.03కి చేరింది. డాలర్ బలహీనపడుతుండడంతో గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి. ఎల్‌కేపీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ జతీన్ త్రివేది మాట్లాడుతూ, “ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, యూఎస్ –ఇండియా–చైనా మధ్య ట్రేడ్ చర్చలతో లాంగ్ టెర్మ్ పెట్టుబడులు పెట్టేందుకు ట్రేడర్లు ఆసక్తి చూపిస్తున్నారు” అని అన్నారు.
గ్లోబల్ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కి (28 గ్రాములకు) 3,698.94 డాలర్లకి, స్పాట్ సిల్వర్ 0.10శాతం పెరిగి ఔన్స్‌కి 42.72 డాలర్లకి చేరాయి. ఫెడ్ పాలసీ సమావేశం ముందు బంగారం ధరలు పెరుగుతున్నాయని, 25 బేసిస్ పాయింట్ల వడ్డీ తగ్గింపు ఖాయంగా కనిపిస్తోందని ఆగ్మోంట్ రీసెర్చ్ హెడ్ రెనిషా చైనాని అన్నారు.