ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్దరించండి.. పేదలు ఇబ్బంది పడుతుండ్రు: మంత్రి పొన్నం

ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్దరించండి.. పేదలు ఇబ్బంది పడుతుండ్రు: మంత్రి పొన్నం
  • మానవీయ కోణంలో ఆలోచన చేయాలె
  • ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ రిక్వెస్ట్

హైదరాబాద్: ఆరోగ్య శ్రీ సేవలు పునరుద్ధరించాలని ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య శ్రీ నిలిపి వేయడం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ విషయంలో మానవీయ కోణంలో ఆలోచన చేయాలన్నారు.

 ప్రజా పాలన ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ ఉచిత పరిమితి రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచడంతో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు రూ.1,779 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. 2014-23 నవంబర్ వరకు సగటున నెలకు రూ.57 కోట్ల చెల్లించగా 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు సగటున రూ.75 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. 

మంత్రి దామోదర రాజనర్సింహ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపు లు జరుపుతున్నారని, ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. పెండింగ్ డబ్బులు విడతల వారిగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినందున.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యా లను కోరారు.