ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్మెంట్ తిప్పలు

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్మెంట్ తిప్పలు

 

  • దాదాపు రూ.250 కోట్ల బకాయిలు
  • గరిష్ట పరిమితి దాటితే అప్రూవల్ కోసం ఇబ్బందులు
  • ఏడాదికిపైగా స్పందించని రిలాక్సేషన్ కమిటీ
  • ఆర్థిక ఇబ్బందుల్లో క్యాన్సర్, కిడ్నీ వ్యాధిగ్రస్తులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వైద్య ఖర్చుల రీయింబర్స్‌‌మెంట్ కోసం ఎదురుచూస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 20 వేల అప్లికేషన్లు వివిధ దశల్లో పెండింగ్‌‌లో ఉండగా, రూ.250 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. నిబంధనల ప్రకారం.. ఉద్యోగులకు రూ.3 లక్షలు, పెన్షనర్లకు రూ.2 లక్షల వరకు వైద్య ఖర్చులు డీఎంఈ ఆమోదంతో తిరిగి చెల్లించాల్సి ఉండగా.. అంతకంటే ఎక్కువైతే రిలాక్సేషన్ కమిటీ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది.  అయితే, దీనికి ఏడాదికిపైగా సమయం తీసుకోవడంతో క్యాన్సర్, కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత కష్టాలు పడుతున్నారు. ఈ సమస్య ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను మాత్రమే కాకుండా పెన్షనర్లను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌‌ఎస్) కింద ప్రైవేటు లేదా కార్పొరేట్ ఆస్పత్రులు చికిత్సలు అందించకపోవడంతో ఉద్యోగులు స్వయంగా ఖర్చులు చెల్లించి, తర్వాత రీయింబర్స్‌‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ బిల్లులు ముందు డిపార్ట్​మెంట్ హెడ్​లు, వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ), ఆయా శాఖల మంత్రులు, చివరకు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌‌లో పడిపోతున్నాయి.

గరిష్టం కంటే తక్కువ నిధులు మంజూరు

ఉద్యోగులకు డీఎంఈ పరిధిలో గరిష్టంగా రూ.3 లక్షల వరకు విడుదల చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ బిల్లులకు చీఫ్ సెక్రటరీలతో కూడిన ఏడుగురు సభ్యుల రిలాక్సేషన్ కమిటీ అనుమతి తప్పనిసరి. ఈ కమిటీ భేటీలు ఎప్పుడు జరుగుతాయో ఎవరికీ తెలియదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిటీ సమావేశాలు అరుదుగా జరగడంతో, అనుమతులు పొందడానికి ఏడాదికిపైగా టైమ్ పడుతున్నది. ఈ ప్రక్రియలో వివక్ష కనిపిస్తున్నదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఐఏఎస్ అధికారుల వైద్య ఖర్చులకు వెంటనే జీవోలు విడుదలవుతున్నాయని, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల బిల్లులు, జిల్లాలు, ఇతర విభాగాల ఉద్యోగులకు మాత్రం జాప్యం జరుగుతున్నదని అంటున్నారు. ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగంలో కార్యదర్శులతో కూడిన ప్రత్యేక సడలింపుల కమిటీ ప్రతిపాదనలను పరిశీలించడానికి చాలా టైమ్ తీసుకుంటున్నదని, కమిటీ అనుమతిపొందిన తర్వాత, ఫైళ్లు సంబంధిత శాఖలకు వెళ్తాయి. అక్కడ మంత్రుల ఆమోదం పొందిన తర్వాతే చెల్లింపు ఆదేశాలు జారీ అవుతాయి. అయితే, కొన్ని శాఖల్లో మంత్రులు సైతం నెలల తరబడి ఫైళ్లను చూడటం లేదని సమాచారం. ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆర్థిక శాఖలో పెండింగ్​లో ఉన్న కొన్ని మెడికల్​ బిల్లులను క్లియర్ చేశారు.

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు తీవ్ర ఇబ్బందులు  

మెడికల్ రీయింబర్స్​మెంట్ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు ఎక్కువ టైమ్ తీసుకుంటుండటంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. క్యాన్సర్, కిడ్నీ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు చికిత్సలకు డబ్బు ఏర్పాటు చేసుకోలేక, ఆర్థిక సంక్షోభంలో పడుతున్నారు. ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించిన నగదు రహిత కార్డుల అంశంపై క్లారిటీ రాలేదు. దీంతో, ఉద్యోగులు తమ వైద్య ఖర్చులను తిరిగి పొందేందుకు మెడికల్ రీయింబర్స్‌‌మెంట్ పథకం కిందే ఆధార పడుతున్నారు. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయొద్దని ఉద్యోగులు కోరుతున్నారు. సామాన్య ఉద్యోగులు, పెన్షనర్లు తమ హక్కుల కోసం ఎంతకాలం ఎదురుచూడాలి? ఈ జాప్యం మానవతా దృక్పథంలో సరికాదని అంటున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి కమిటీలను మరింత సమర్థవంతంగా రెగ్యులర్​గా భేటీ అయ్యేలా చేయాలని, మంత్రులు ఫైళ్లను వేగంగా ఆమోదించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, మెడికల్​ రీయింబర్స్​ మెంట్ అప్లికేషన్లను త్వరగా పరిష్కరించి బకాయిలను క్లియర్ చేయాలని కోరుతున్నారు.