
భారతదేశంలో మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వ జోక్యంపై మరోసారి తీవ్ర చర్చకు తెరలేపింది అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL) దాఖలు చేసిన ఒక పరువునష్టం కేసు. ఈ కేసులో ఢిల్లీ కోర్టు ఇచ్చిన 'గ్యాగ్ ఆర్డర్' ఆధారంగా, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) పలువురు ప్రముఖ జర్నలిస్టులు, మీడియా సంస్థలకు 'టేక్‌డౌన్ నోటీసులు' జారీ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నోటీసులు అందుకున్న వారిలో రవీష్ కుమార్, ధ్రువ్ రాఠీ, న్యూస్‌లాండ్రీ, ది వైర్, హెచ్ డబ్ల్యూ న్యూస్ వంటి పలు మీడియా సంస్థలు, జర్నలిస్టులు, క్రియేటర్లు ఉండటం ఈ వివాదానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
వివాదానికి దారితీసిన అంశాలు
సెప్టెంబర్ 6న ఢిల్లీ కోర్టు అదానీ గ్రూప్‌పై పరువునష్టం కలిగించే కంటెంట్‌ను తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాలు వెలువడిన పది రోజుల తర్వాత, అంటే సెప్టెంబర్ 16న, ఆ కంటెంట్‌ను తొలగించడంలో మీడియా సంస్థలు విఫలమయ్యాయని పేర్కొంటూ కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులో 138 యూట్యూబ్ లింకులు, 83 ఇన్‌స్టాగ్రామ్ పోస్టులను తొలగించాలని ఆదేశించారు.
ఈ జాబితాలో కేవలం పరిశోధనాత్మక కథనాలు మాత్రమే కాకుండా, సాధారణ ప్రస్తావనలు ఉన్న వీడియోలు, వ్యంగ్య కథనాలు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వాటిల్లో అదానీ కథనం స్క్రీన్‌షాట్ ఉన్న ఒక న్యూస్‌లాండ్రీ వీడియోను తొలగించాలని కోరారు. అలాగే, హాస్యనటుడు కునాల్ కమ్రా సెన్సార్‌షిప్‌పై మాట్లాడిన ఒక ఇంటర్వ్యూ కూడా ఈ జాబితాలోకి చేరింది. 'ది న్యూస్ మినిట్' చేసిన మూడు వీడియోలు, అలాగే న్యూస్‌లాండ్రీ యూట్యూబ్ ఛానెల్‌లో హోస్ట్ చేసిన 'సౌత్ సెంట్రల్', 'లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్' ఎపిసోడ్‌లను కూడా తొలగించాలని ఆదేశించారు.
రాజకీయ కోణం..
ఈ వివాదానికి రాజకీయ కోణం కూడా తోడైంది. జర్నలిస్ట్ శ్రీనివాసన్ జైన్, ఎన్‌సిపి నాయకులు శరద్ పవార్, అజిత్ పవార్ లతో చేసిన ఇంటర్వ్యూలను కూడా తొలగించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఆ ఇంటర్వ్యూలలో 2019లో గౌతమ్ అదానీ భారతీయ జనతా పార్టీకి ఎన్‌సిపి మద్దతు ఇచ్చే అవకాశం గురించి చర్చించడానికి ఒక సమావేశాన్ని నిర్వహించారని నాయకులు ధృవీకరించారు. ఇది కేవలం పరువునష్టం కేసు కాదని, కొన్ని రాజకీయ సంబంధాలను బయటపెట్టే సమాచారాన్ని కూడా నియంత్రించే ప్రయత్నమని విశ్లేషకులు భావిస్తున్నారు.
న్యాయ నిపుణుల అభిప్రాయాలు
ఈ విషయంపై సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ స్పందిస్తూ.. ఇది ఒక సివిల్ కేసు. కోర్టు మధ్యవర్తులైన గూగుల్, మెటా వంటి సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం ఇందులో ఎందుకు జోక్యం చేసుకుంటోంది? కోర్టు తన ఆదేశాలను ఎలా అమలు చేయాలో తెలుసు, దానికి మంత్రిత్వ శాఖ అవసరం లేదు. మంత్రిత్వ శాఖ న్యాయ ప్రక్రియను అడ్డుకుంటోంది అని విమర్శించారు.
అదానీ గ్రూప్ తరపున న్యాయవాదుల వాదన..
నిరాధారమైన కథనాలు కంపెనీ బ్రాండ్ విలువను, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీశాయని అదానీ గ్రూప్ తరపున న్యాయవాదులు వాదించారు. ముఖ్యంగా, 2023లో సంచలనం సృష్టించిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికను పదేపదే ప్రస్తావించడం తమ ప్రతిష్టకు హాని కలిగించిందని పేర్కొన్నారు. అయితే, కోర్టు తన ఉత్తర్వులో నిష్పక్షపాతమైన , ఖచ్చితమైన రిపోర్టింగ్ కు రక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ వివాదం చివరికి ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఇది కేవలం ఒక సంస్థ పరువునష్టం కేసుగా కాకుండా, భారతదేశంలో భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న చర్చగా మారింది.