
ఆసియా కప్ లో ఇండియా - పాక్ మ్యాచ్ కు సంబంధించి వివాదాలు ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ పై ఇండియా గెలుపును పహల్గాం బాధితులకు అంకితం ఇస్తున్నట్లు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత చేసిన వ్యఖ్యాలు సంచలనంగా మారాయి. విమర్శలు, ప్రతివిమర్శలకు దారి తీశాయి.
AAP నేత సౌరభ్ భరద్వాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆదివారం (సెప్టెంబర్ 14) జరిగిన మ్యాచ్ లో ఇండియా పాకిస్తాన్ పై గెలవడంతో.. ఆ గెలుపును ఉగ్రదాడి బాధితులకు అంకితం ఇస్తున్నట్లు సూర్యకుమార్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై ఆప్ నేత భరద్వాజ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. గెలుపును బాధితులకు డెడికేట్ చేయడం చాలా ఈజీ.. కానీ మీ కమిట్మెంట్ ఎంత మేరకు ఉందని ప్రశ్నించారు.
మీకు గానీ.. బీసీసీఐ కి గానీ.. ఐసీసీ కి గానీ ధైర్యం ఉంటే.. కమిట్ మెంట్ ఉంటే.. మీకు మరో ఛాలెంజ్ విసురుతున్నాం. బ్రాడ్ క్యాస్ట్ రైట్స్ నుంచి, ప్రకటనల నుంచి, మొత్తం బిజినెస్ నుంచి వచ్చిన మొత్తాన్ని ఆ బాధితులకు ఇవ్వాలి. భర్తలను కోల్పోయిన మహిళలకు ఇవ్వగలరా. అప్పుడు మీ డెడికేషన్ నిజమని మేము నమ్ముతాం.. అని అన్నారు.
అంతటితో ఆగకుండా.. వారికి కమిట్ మెంట్ లేదు.. వారికి ధైర్యం లేదు.. వాళ్లు డెడికేట్ చేస్తున్నట్లు ఊరికెనే కామెంట్స్ చేస్తుంటారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సూర్య ఏమన్నాడు:
పహల్గాం దాడి తర్వాత జరిగిన మొదటి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ పై అంచనాలు, విమర్శలు చాలా ఉన్నాయి. 2025 ఏప్రిల్ 22న పాక్ ఉగ్రమూకలు జరిపిన దాడిలో 26 మంది చనిపోయారు. ఈ మ్యాచ్ బాయ్ కాట్ చేయాలని అప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ నడిచింది. తీవ్ర ఒత్తిడి మధ్య.. రాజకీయ విమర్శల నడుమ చివరికి మ్యాచ్ ఆడారు. పాక్ పై ఏడు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. ఆ గెలపును ఆపరేషన్ సిందూర్ కు గుర్తుగా ఆర్మీకి, పహల్గాం దాడికి అంకితం ఇస్తున్నట్లుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రకటించాడు.