జూబ్లీహిల్స్లో సొంత నిధులతో తాగునీటి పైపులైన్లు వేయిస్తా: మంత్రి వివేక్

జూబ్లీహిల్స్లో సొంత నిధులతో తాగునీటి పైపులైన్లు వేయిస్తా: మంత్రి వివేక్

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మౌలిక వసతులను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం  కృషి చేస్తోందని మంత్రి డాక్టర్. గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. బుధవారం (సెప్టెంబర్ 17) రహమత్ నగర్ డివిజన్ లోని టి అంజయ్య నగర్, శ్రీరాంనగర్, రహమత్ నగర్ ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.  తాగునీటి పైపులైన్లు,  సీవరేజ్ పనులకు సంబంధించి  రూ. 4 కోట్ల 63 లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ గతంలో శంకుస్థాపన చేసిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని, తాను పనులు జరుగుతాయని స్పష్టత ఉంటేనే శంకుస్థాపన కార్యక్రమాలు  చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు అభివృద్ధి చేసి చూపితేనే మనపై వారికి నమ్మకం ఉంటుందన్నారు. ఇప్పటికే రహమత్ నగర్ డివిజన్ కు సుమారు రూ.30 కోట్లు నిధులు కేటాయించి పనులు ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. 

నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా కొందరు స్థానికులు తమ ప్రాంతంలో కూడా  తాగునీటి పైపులైన్ సమస్య ఉందని ఆయన దృష్టికి తీసుకురాగా... త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అక్కడ కూడా పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి నిధులు ఆలస్యం అయితే తన సొంత నిధులతో పైపులైన్ మార్పిడి చేస్తామని హామీ ఇచ్చారు.

 ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, స్థానిక కార్పోరేటర్ సీఎన్ .రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నవీన్ యాదవ్, భవాని శంకర్, కార్పొరేషన్ చైర్మన్లు మల్రెడ్డి రాంరెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, జైపాల్  తదితరులు పాల్గొన్నారు.