
సరూర్‌నగర్: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో దారుణం జరిగింది. వరుసకు బావమరిది అయిన వ్యక్తిని సుపారీ గ్యాంగ్‌తో చంపించేందుకు బావ యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే.. అదృష్టవశాత్తూ ఆ గ్యాంగ్ అటాక్ నుంచి వెంకట్ రెడ్డి బావమరిది అయిన నరసింహారెడ్డి తప్పించుకున్నాడు. సుపారీ గ్యాంగ్తో పాటు వెంకట్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా బావ, బావమరిది మధ్య విభేదాలు ఉన్నాయి. హయత్ నగర్లో ఉండే వెంకట్ రెడ్డి తనకు వరుసకు బావమరిది అయిన నరసింహారెడ్డిని హత్య చేయడానికి సుపారీ ఇచ్చాడు. నరసింహారెడ్డిని హత్య చేయడానికి సుపారీ గ్యాంగ్ ప్రయత్నించారు. ఆ గ్యాంగ్ నుంచి తప్పించుకొని సరూర్ నగర్ పోలీసులకు నరసింహారెడ్డి ఫిర్యాదు చేశాడు. నిందితులకు సుపారీ ఇచ్చింది నరసింహారెడ్డి సోదరి, ఆమె భర్త వెంకట్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.
సుపారీ గ్యాంగ్తో పాటు వెంకట్ రెడ్డిని అరెస్ట్ చేసిన సరూర్ నగర్ పోలీసులు రిమాండ్కు తరలించారు. ఫిర్యాదులో నరసింహారెడ్డి పేర్కొన్న వివరాల ప్రకారం.. నరసింహారెడ్డి TGRTC ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వెంకట్ రెడ్డితో 2013 నుంచి ఒక ల్యాండ్ విషయంలో నరసింహారెడ్డికి గొడవలు జరుగుతున్నాయి. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. అయితే.. కేసు వాపస్ తీసుకోవాలని వెంకట్ రెడ్డి ఇంటికి రౌడీలను పంపి బెదిరించాడని, వెనక్కి తగ్గకపోవడంతో సుపారీ గ్యాంగ్తో చంపించాలని చూశాడని ఫిర్యాదులో నరసింహారెడ్డి పేర్కొన్నాడు.
మానవ సంబంధాలు మంట గలిసిపోతున్నాయని నిరూపించిన మరో ఘటన కూడా హైదరాబాద్లో వెలుగుచూసింది. గాజుల రామారంలో సొంత అన్న ఇంట్లో చెల్లెలు చోరీ చేసింది. క్యాసినో గేమ్‌లో ఒక మహిళ 5 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. స్నేహితులతో కలిసి అన్న ఇంట్లో చోరీకి ప్లాన్ చేసింది. అనుకున్నట్టుగానే తన ఫ్రెండ్స్తో కలిసి సొంత అన్న ఇంటికే కన్నం వేసింది. ఈ నీచానికి పాల్పడిన మహిళతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాసినో, బెట్టింగ్ లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.