ఇంత నిర్లక్ష్యమైతే ఎలా సార్... అనారోగ్యంతో ఆసుపత్రికి వెళితే.. బాలుడి ప్రాణాలకే ముప్పు తెచ్చిన వైద్యులు..

ఇంత నిర్లక్ష్యమైతే ఎలా సార్... అనారోగ్యంతో ఆసుపత్రికి వెళితే.. బాలుడి ప్రాణాలకే ముప్పు తెచ్చిన వైద్యులు..

అనారోగ్యంతో ఆసుపత్రికి వెళితే గడువు తీరిన IV బాటిల్స్ ఎక్కించి 11 ఏళ్ళ బాలుడికి ప్రాణాలకే ముప్పు తెచ్చారు డాక్టర్లు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని పన్నాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో వెళ్లిన బాలుడికి గడువు తీరిన IV బాటిల్స్ ఎక్కించారు వైద్యులు. అంతే కాకుండా గడువు తీరిన బాటిల్ కి బదులుగా ఇచ్చిన మరో బాటిల్ కూడా గడువు తీరిందే అవ్వడంతో బాలుడి పరిస్థితి మరింత విషమంగా మారింది.

డైరెక్ట్ గా సిరల్లోకి ఇంజెక్ట్ చేసిన RL లిక్విడ్ బాధితుడి శరీరంపై వెంటనే తీవ్రమైన ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. బాటిల్ ఎక్కించిన వెంటనే బాలుడి పరిస్థితి క్షేనించటం గమనించిన కుటుంబసభ్యులు సిబ్బందికి సమాచారం అందించారు. డ్యూటీలో ఉన్న నర్సు వచ్చి చెక్ చేయగా బాటిల్ గడువు మార్చి 2025లోనే ముగిసిందని తెలిసింది. వెంటనే గడువు ముగిసిన బాటిల్ తీసేసిన నర్సు బదులుగా మరో బాటిల్ తెచ్చి ఎక్కించింది. అయితే.. ఆ రెండోసారి ఎక్కించిన బాటిల్ కూడా 2025 జూన్ నాటికే గడువు తీరినది కావడంతో బాలుడి ఆరోగ్యం మరింత క్షీణించింది.

ఇంత జరుగుతున్నా కూడా.. ఒక్క డాక్టర్ కూడా పిల్లాడిని చూడటానికి రాలేదని ఆరోపిస్తున్నారు కుటుంబసభ్యులు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డకు ఈ పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేయగా.. ఇది ముమ్మాటికీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జరిగిందని.. దర్యాప్తు జరిపి బాద్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.