
ఢిల్లీ: ఏపీ మంత్రి లోకేశ్ ను మాజీ మంత్రి కేటీఆర్ రహస్యంగా మూడు సార్లు కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అర్ధరాత్రి సమయంలో మూడు సార్లు కలిశారని అన్నారు. చీకట్లో కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కేటీఆర్ గంజాయి బ్యాచ్ అని, ఆయన చుట్టూ ఉన్నోళ్లంతా డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపించారు. ఆయన ఫ్రెండ్ దర్శకుడు కేదార్ డ్రగ్స్ తీసుకొనే దుబాయ్ లో సూసైడ్ చేసుకున్నారని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టును తెప్పించామని అన్నారు.
డ్రగ్స్ తీసుకునే వారితో తానేం మాట్లాడుతానని అన్నారు. కేటీఆర్ చిట్టా మొత్తం తన వద్ద ఉందని సీఎం చెప్పారు. వైట్ చాలెంజ్ విసిరితే పారిపోయింది కేటీఆర్ కాదా? అని ప్రశ్నించారు. డ్రగ్స్ పై మాట్లాడకుండా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని అన్నారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. వాళ్లలా తాము ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని చెప్పారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీకి కాకుండా ఫాంహౌస్ కు వెళ్లాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ను కాపాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాపత్రయ పడుతున్నారని అన్నారు.
ఆర్డినెన్స్, చట్టం వేరు..
42% బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని సీఎం చెప్పారు. గవర్నర్ కి పంపించిన ఆర్డినెన్స్ , రాష్ట్రపతి దగ్గరికి వచ్చిన చట్టం రెండు వేర్వేరని చెప్పారు. బీఆర్ఎస్ పదేండ్లలో సాధించలేనిది తాము సాధించామని చెప్పారు. కేసీఆర్ 2018లో బీసీ రిజర్వేషన్లను 23 శాతానికి కుదించారని చెప్పారు. రిజర్వేషన్లు 50% మించేది లేదంటూ చట్టం చేశారని అన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ముంటే గుజరాత్, యూపీ, మహారాష్ట్ర రాష్ట్రాలలో అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను తీసేయాలని అన్నారు. బీసీలకు 42% సీట్లిచ్చి సెప్టెంబర్ 30 లోగా సంస్థలు ఎన్నికలు పూర్తిచేస్తామని చెప్పారు.
ఈడీ అరెస్టు చేయదా ?
గొర్రెలు, ఫార్ములా ఈ రేస్ కేసు, జీహెచ్ఎంసీ ఆఫీసర్ శివ బాలకృష్ణ కేసులోకి ఎంటరైన ఈడీ ఎందుకు అరెస్టు చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈడీ జోక్యం చేసుకున్నప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ శాఖకు సంబంధించిన మంత్రిని కలిసి ఎందుకు ఫాలో అప్ చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా పనిచేస్తున్నాయని అన్నారు. దేనికైనా సమయం రావాలని, పోరాటం తన చివరి అస్త్రమని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని హైకోర్టు పరిశీస్తోందని సీఎం చెప్పారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు కేసులపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఏ సినిమాలోనైనా విలన్లే చివర్లో శిక్షించబడతారని చెప్పారు. ఇక్కడా అదే జరగబోతోందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ బీఆర్ఎస్ పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తోందని అన్నారు. పాలన అంటే పాంహౌస్ లో కూర్చోవడం కాదని, కేసీఆర్ ప్రతిపక్ష నేతగా తన పాత్ర పోషించడం లేదని, ఆయన వచ్చి సలహాలు ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు.
మీటింగ్కు వెళ్లకుంటే వాదన వినిపించేదెవరు ?
జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన మీటింగ్ కు తాను హాజరు కాని పక్షంలో తెలంగాణ వాదన ఎవరు వినిపిస్తారని సీఎం ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను రాష్ట్ర సమస్యలపై పిలిస్తే ఎందుకు వెళ్లొద్దన్నారు. తనను జై తెలంగాణ అనడం లేదని ఏడ్చేవాళ్ళు పార్టీ పేరులో తెలంగాణను ఎందుకు తొలగించుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ చనిపోయి బీజేపీని బతికించిందని చెప్పారు.
ఎవడబ్బసొమ్మని ఒప్పుకుండ్రు
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో కృష్ణా జలాలు 299 టీఎంసీలు చాలని సంతకాలు పెట్టిందే హరీశ్ రావని, అప్పుడు ఎవడబ్బ సొమ్మని ఒప్పుకున్నారని సీఎం ప్రశ్నించారు. తెలంగాణకు చేయాల్సిన నష్టమంతా చేసింది కేసీఆరేనని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రతో పనిచేస్తామని సీఎం అన్నారు. కేసీఆర్ గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత తనదని, ఆయన అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని సీఎం కోరారు.