హైదరాబాద్ రాయదుర్గంలో చుక్కలు చూసిన మెట్రో ప్రయాణికులు.. ఏమైందంటే..

హైదరాబాద్ రాయదుర్గంలో చుక్కలు చూసిన మెట్రో ప్రయాణికులు.. ఏమైందంటే..

హైదరాబాద్: నాగోల్, రాయదుర్గం రూట్లో మెట్రో ట్రైన్ సడన్గా ఆగిపోయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో మెట్రో ట్రైన్ నిలిచిపోయింది. దీంతో ఆ ట్రైన్ లోని ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మెట్రో రైలు నిలిచిపోవడంతో నాగోల్, రాయదుర్గం రూట్లో మెట్రో ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రాయదుర్గంలో మెట్రో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. మెట్రో ట్రైన్ కోసం15 నిమిషాలకు పైగానే ప్రయాణికులు ఎదురుచూశారు. గతంలో కంటే సొంత వెహికల్స్ పెరగడంతో రోజూ ఎక్కడికక్కడ ట్రాఫిక్​జామ్ అవుతోంది.

వర్షం పడితే హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్లో నరకయాతన పడక తప్పని పరిస్థితి. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న రూట్లలో ఎక్కువ మంది మెట్రోనే ఎక్కుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రైన్ వచ్చిన వెంటనే తోసుకుంటూ ఎక్కేస్తున్నారు. త్వరగా చేరుకోవాలనే ఆలోచనతో కొంచెం ప్లేస్ ఉన్న ఇరుక్కుని మరీ ప్రయాణిస్తున్నారు. దీంతో మెట్రో ట్రైన్లు, స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఆఫీసులకు వెళ్లి, వచ్చే సమయాల్లో మెట్రో సర్వీసులు పెంచాలని ఐటీ ఉద్యోగులు, ఇతర ప్యాసింజర్లు కోరుతున్నారు.

రాయదుర్గం నుంచి నాగోల్, ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ రూట్లలో విపరీతమైన రద్దీ ఉంటోంది. ఆఫీసులు అయిపోయాక మెట్రోలో ఇంటికి వెళ్లాలంటే కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. ట్రైన్‌ కోచ్లు, సర్వీసులు పెంచాలని జనాల నుంచి మెట్రో సంస్థకు రిక్వెస్టులు వస్తూనే ఉన్నాయి. అయితే ప్యాసింజర్ల సౌకర్యం కోసం గతంలో ఐదు నిమిషాలకో రైల్ వస్తే, ఇప్పుడు మూడు నిమిషాలకు ఒకటి నడుస్తోందని మెట్రో అధికారులు చెబుతున్నారు. రద్దీ ఎక్కువున్నప్పుడు  ప్యాసింజర్లు ఓపికతో మరో ట్రైన్ వచ్చే వరకు ఎదురుచూడాలని కోరుతున్నారు.

హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం 57 రైళ్లను నడుపుతోంది. మొత్తం 171 కోచ్లున్నాయి. అయినా సరే.. రద్దీ పెరిగిపోవడంతో మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. హ్యూందాయ్ రోటేమ్ సంస్థ మొదటి దశలో 57 రైళ్లను హైదరాబాద్ మెట్రోకు అందించింది.171 కోచ్లతో కూడిన 57 రైళ్లకు  రూ.1800 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. దక్షిణ కొరియా నుంచి దిగుమతి, రవాణ ఖర్చులు అదనం అయినట్లు సమాచారం.