
- వచ్చే ఏడాది కల్లా చిత్తూరుకు నీళ్లు
- రాయలసీమలో ప్రతి ఎకరాకూ నీళ్లివ్వడమే లక్ష్యం
- రెండు తెలుగు రాష్ట్రాలూ బాగుండాలె
- నదుల అనుసంధానానికి సహకరించుమని తెలంగాణను కోరా
- నంద్యాలో ఏపీ సీఎం చంద్రబాబు
నంద్యాల: శ్రీశైలం మల్లన్న దగ్గర ప్రారంభమయ్యే నీళ్లు.. తిరుమల వెంకన్న వరకు తీసుకెళ్లవచ్చని, దేవుళ్లను కూడా అనుసంధానం చేసి జలహరతి ఇద్దామని,ఈ రకమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నిన్న ఢిల్లీలో రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలపై చర్చించినట్టు చెప్పారు. ఇవాళ నంద్యాలలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఇబ్బందులు, రాజకీయాలు ఉంటాయని, వాటిని అధిగమించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. తనను తిట్టినా, శాపనార్థాలు పెట్టిన వెనుకడుగు వేయబోనని చెప్పారు. క్లైమోర్ మైన్లే నన్నేమీ చేయలేకపోయాయని, ఈ విమర్శలు నన్నేం చేయగలవని అన్నారు.
తెలంగాణతో గొడవలు పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరిద్దామని చెప్పారు. గోదావరి బోర్డు హైదరాబాద్ లో, కృష్ణా బోర్డు విజయవాడలో పెడుతున్నట్టు తెలిపారు . శ్రీశైలం ప్లంజ్ పూల్ పనులకు మనమే డబ్బులిచ్చి పనులు చేస్తామని చంద్రబాబు అన్నారు. అవసరమైతే గోదావరి నీళ్లు వాడుకోమని తెలంగాణకు చెప్పానని, నదుల అనుసంధానానికి సహకరించమని కోరానని చంద్రబాబు అన్నారు.
రాయలసీమకు ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలని, కనీసం రెండు మెట్ట పంటలు వేసుకునేలా నీటి సౌకర్యం కల్పించాలనేదే తన లక్ష్యమని అన్నారు. వేదావతిని పూర్తి చేసి ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాలకు నీళ్లిస్తామన్నారు. ఘోరకల్లు మరమ్మతు పనులు కూడా 96 కోట్లతో ప్రారంభిస్తామన్నారు.గత ప్రభుత్వం అలగనూరు బండ్ కు ఏమీ చేయలేదన్నారు. అడవిపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి నీవా బ్రాంచ్ కెనాల్‌కు నీళ్లు తీసుకెళ్తామని చెప్పారు. ఈ ఏడాది ఏ విధంగా కుప్పంకు నీళ్లు వెళ్తున్నాయో.. వచ్చే ఏడాది చిత్తూరుకు నీళ్లు అందిస్తామని చెప్పుకొచ్చారు.