
భారతదేశం బహుభాషా సంస్కృతికి నిలయం. ప్రతి భాషకు దానిదైన చరిత్ర, సంస్కృతి, అస్తిత్వం ఉన్నాయి. అయితే, కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో భాషా వివాదాలు, ముఖ్యంగా హిందీని ఇతర భాషలపై రుద్దే ప్రయత్నంపై తలెత్తుతున్న ఆందోళనలు నిత్యకృత్యంగా మారాయి. దేశంలోనే ధనిక రాష్ట్రమైన మహారాష్ట్రలో ప్రస్తుతం భాష, అస్తిత్వం పేరుతో జరుగుతున్న ఆందోళనలు ఈ సమస్య ఎంత లోతుగా పాతుకుపోయిందో స్పష్టం చేస్తున్నాయి.
ఒకవైపు ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రంలో భాష పేరుతో హింసాత్మక సంఘటనలు జరుగుతుండడం, మరోవైపు రాజకీయ నాయకుల వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మరాఠీని రాష్ట్ర భాషగా, ఇంగ్లిష్‌ను రెండో భాషగా, హిందీని మూడో భాషగా తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో గత ఏప్రిల్ నెల నుంచి ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఈ నిర్ణయం సమాఖ్య విధానానికి అనుగుణంగానే తీసుకున్నామని మహారాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంది.
నిజానికి, భారత విద్యావ్యవస్థకు ప్రోత్సాహం, క్రమబద్ధీకరణ లక్ష్యాలతో ప్రభుత్వం 1968లో జాతీయ విద్యావిధానాన్ని (NEP) అమల్లోకి తెచ్చింది. అవసరాన్ని బట్టి దానిని మార్పులు చేస్తోంది. ప్రస్తుతం ఆందోళనలకు కారణమైన త్రిభాషా విధానాన్ని ఐదేండ్ల కిందటే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీన్ని దశలవారీగా అమలుచేస్తున్నప్పటికీ, ఇది వివాదాస్పదంగా మారి, గతంలోనూ పలు ఆందోళనలకు దారితీసింది.
మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సివిల్ సొసైటీ గ్రూపులు, భాషాభిమానులు, ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల్లో ప్రధానంగా మాట్లాడే హిందీ భాషను మహారాష్ట్ర ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత భాషాప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడంతో మహారాష్ట్ర సహా చాలా రాష్ట్రాల్లో భాష అన్నది సున్నితమైన అంశంగా మారింది.
గత ఏడాది, ఇండియా సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో కన్నడ భాషాభిమానులు ఆందోళనలు నిర్వహించారు. కంపెనీలు, షాపుల పేర్లను కేవలం ఇంగ్లిష్‌లోనే గాకుండా స్థానిక భాషలోనూ రాయాలనేది వారి డిమాండ్. ఈ సంఘటనలు భాషా అస్తిత్వ పోరాటాలు కేవలం మహారాష్ట్రకే పరిమితం కాదని స్పష్టం చేస్తున్నాయి.
హిందీకి ప్రోత్సాహంపై అనుమానాలు
భారత్‌లో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ. హిందీని ప్రోత్సహించడానికి కొన్నేండ్లుగా వివిధ ప్రభుత్వాలు పలు చర్యలు చేపట్టాయి. ఇది స్థానిక సంస్కృతిని దెబ్బతీస్తుందనే సందేహాలు వెల్లువెత్తాయి. హిందీ భాషను సమాజంపై బలవంతంగా రుద్దుతున్నారనే ఆరోపణలు రావడానికి అనేక కారణాలున్నాయి. మొదటగా, జాతీయ భాష అనే నినాదం.
రాజ్యాంగం ప్రకారం భారతదేశానికి జాతీయ భాష అంటూ ఏదీ లేదు. హిందీ కేవలం అధికార భాష (Official Language) మాత్రమే. అయినప్పటికీ, హిందీని జాతీయ భాషగా ప్రచారం చేయాలనే తపన హిందీయేతర రాష్ట్రాలలో ఆందోళన కలిగిస్తోంది.
‘ఒకే దేశం - ఒకే భాష’
ప్రభుత్వ విధానాలు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, రైల్వేలు వంటి వాటిలో హిందీ వినియోగాన్ని పెంచడం, హిందీలో శిక్షణను తప్పనిసరి చేయడం, ఉద్యోగాలలో హిందీ పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలు హిందీయేతర ప్రజలకు అసమానతలకు దారితీస్తాయని భావిస్తున్నారు. మూడోది, రాజకీయ ప్రకటనలు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తరహా ఆందోళనలు పెరిగాయి.
హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని బీజేపీకి చెందిన నాయకులు తరచుగా హిందీకి ప్రాధాన్యాన్ని ఇస్తూ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ‘ఒకే దేశం - ఒకే భాష’ అనే నినాదం భారతదేశ వైవిధ్యాన్ని విస్మరిస్తుందనే విమర్శ ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హిందీ భాషను ‘పెద్దమ్మ భాష’గా అభివర్ణించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. జాతీయ సమగ్రత దృక్పథం దీని వెనుక ఒక కారణం.
భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాష హిందీ కాబట్టి, దేశవ్యాప్తంగా కమ్యూనికేషన్ కోసం హిందీ అవసరమని ఆయన భావించి ఉండవచ్చు. ‘పెద్దమ్మ భాష’అనే పదం భాషకు ఒక గౌరవాన్ని ఆపాదించాలనే ప్రయత్నంగా కనిపించినప్పటికీ, అది ఇతర మాతృభాషల ప్రాముఖ్యాన్ని తగ్గించి చూసేవిధంగా ఉంది.
మరాఠీ మాట్లాడనివారిపై దాడులు
ఏప్రిల్ నెలలో థానే జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలపై మరాఠీలోనే మాట్లాడాలని పట్టుబట్టిన వ్యక్తి దాడికి పాల్పడటం, ముంబయిలో ఒక సెక్యూరిటీ గార్డుకు మరాఠీ తెలియదన్నందుకు స్థానిక ప్రతిపక్ష పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు కొట్టారని ఆరోపించడం, మే నెలలో ఓ డెలివరీ ఏజెంట్ మరాఠీలో మాట్లాడలేదని ముంబయిలో ఓ జంట డబ్బులు చెల్లించడానికి నిరాకరించడం, తాజాగా మరాఠీలో మాట్లాడలేదని గత వారం ఓ దుకాణ యజమానిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలుగా భావిస్తున్న కొంతమంది దాడి చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
ఈ ఆందోళనలు, తదనంతర పరిణామాలతో సామాజిక విభజనలు పెరిగాయి. అదే సమయంలో దాదాపు రెండు దశాబ్దాలుగా రాజకీయ వైరం నెరపిన ఇద్దరు నాయకులు తమ విభేదాలను పక్కనబెట్టి కలిసిపోయారు. వారిలో ఒకరు బాల్ థాకరే కుమారుడు కాగా, మరొకరు ఆయన సోదరుడి కొడుకు. స్థానిక ప్రతిపక్షం శివసేన (యూబీటీ) అధిపతి ఉద్ధవ్ థాకరే, ఎంఎన్ఎస్ పార్టీ నాయకుడు రాజ్ థాకరే హిందీ అమలును వ్యతిరేకిస్తూ గత వారం సంయుక్తంగా ర్యాలీ నిర్వహించడం ఈ భాషా రాజకీయాల తీవ్రతను తెలియజేస్తుంది.
భాషా వైవిధ్యాన్ని గౌరవించాలి
భాషా వివాదాలు భారతదేశానికి కొత్తేమీ కాదు. అయితే, దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, ఐక్యత, సమగ్రత అత్యవసరమైన ఈ సమయంలో భాష పేరుతో జరుగుతున్న హింస, విభేదాలు సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఒక భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం వల్ల అది సామాజిక అశాంతికి దారితీస్తుంది.
భారతదేశంలో భాషా వైవిధ్యాన్ని గౌరవించడం, అన్ని మాతృభాషలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం అత్యవసరం. విద్యార్థులు తమ మాతృభాషలో ప్రాథమిక విద్యను అభ్యసించడం, ఆ తర్వాత ఇతర భాషలను నేర్చుకోవడానికి ప్రోత్సాహం అందించడం సరైన పద్ధతి. హిందీకి దానిదైన ప్రాధాన్యం ఉండవచ్చు. కానీ, అది ఇతర భాషలపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేయకూడదు. అభివృద్ధి అనేది కేవలం ఒక భాష నేర్చుకోవడం వల్ల మాత్రమే రాదు. అది విద్య, నైపుణ్యాలు, ఆర్థిక అవకాశాలు, సామాజిక సమానత్వం, మౌలిక సదుపాయాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
పవన్ కల్యాణ్ వంటి నాయకులు భాషా విషయాలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు, దాని సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కోణాలను పూర్తిగా అవగాహన చేసుకొని మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. భాషను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం మానేసి, భాషా వైవిధ్యాన్ని దేశ సంపదగా పరిగణించినప్పుడు మాత్రమే భారతదేశం నిజమైన ఐక్యతను, సమగ్రతను, సుస్థిరాభివృద్ధిని సాధించగలదు.
త్రిభాషావిధానంపై మహారాష్ట్ర వెనకడుగు
త్రిభాషా విధానంపై మహారాష్ట్రలో ఉద్రిక్తతలు అధికమవ్వడంతో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం వెనకడుగు వేసింది. తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ త్రిభాషా విధానంపై పునఃపరిశీలనకు ఒక కమిటీని నియమించింది. కానీ, వివాదం ఇంకా సద్దుమణగలేదు.
దేశంలోనే అత్యంత ధనిక నగరపాలక సంస్థ ముంబయి సిటీ సహా మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు చాలాకాలంగా వాయిదాపడుతూ వచ్చాయి. వాటి నిర్వహణకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ భాషాపరమైన వివాదం రేగి, అధికార కూటమికి, ప్రతిపక్ష పార్టీలకు మధ్య రాజకీయ వేడిని రాజేసింది. పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ భాషా వివాదం కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితం కాలేదు, హింసాత్మక సంఘటనలకు కూడా దారితీసింది. మరాఠీ మాట్లాడనివారిపై, మరాఠీయేతరులపై దాడులు జరుగుతున్నాయి.
-మేకల ఎల్లయ్య, సీనియర్ జర్నలిస్ట్-