బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలి : బీసీ రిజర్వేషన్ సాధన సమితి నాయకులు

 బీసీలకు 42శాతం  రిజర్వేషన్ అమలు చేయాలి :  బీసీ రిజర్వేషన్ సాధన సమితి నాయకులు

మంచిర్యాల, వెలుగు: విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్​ను 42 శాతానికి పెంచుతూ ఆమోదించిన బిల్లులను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి నాయకులు కోరారు. మంగళవారం మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి, కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లులను తొమ్మిదో షెడ్యూల్​లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

 దేశంలో మెజార్టీ వర్గమైన బీసీల న్యాయమైన కోరికలు నెరవేర్చడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. బీసీ మేధావుల ఫోరం ఉమ్మడి జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ శ్రీరామోజు కొండయ్య, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, సామాజిక ఉద్యమ నాయకులు కామిల్ల జయరావు, షబ్బీర్ పాషా, బుస్స యాదగిరి, పాటి రాజు, ముద్రగడ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.