- గతేడాదిలో 2429 మందిపై..
- 2022 సర్వే ప్రకారం యాదాద్రి జిల్లాలో కోతుల సంఖ్య 5. 17 లక్షలపైనే
యాదాద్రి జిల్లాలో కోతుల దాడిలో గాయపడిన వారి సంఖ్య పెరిగిపోతోంది. వాటి దాడిలో గాయపడి ప్రభుత్వ హాస్పిటల్లో వేలాది మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం 2025 జనవరి నుంచి అక్టోబర్ వరకూ కోతుల దాడిలో 4983 మంది గాయపడి ట్రీట్మెంట్ పొందారు. ఈ లెక్కన ప్రతి రోజు 16 మందికి పైగా కోతుల దాడిలో గాయపడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయించుకున్నవారి లెక్కలు స్పష్టంగా తెలియడం లేదు. 2024 లో కోతుల దాడిలో గాయపడిన వారికంటే ఈ ఏడాది బాధితుల పెరిగింది. గతేడాది 12 నెలల్లో 2429 మంది గాయపడితే ఈసారి పది నెలల్లోనే 4983 మంది గాయపడ్డారు.
యాదాద్రి, వెలుగు: కుక్క తరహాలోనే కోతి కరిచినా రేబిస్ సహా రకరకాల వ్యాధులు సంక్రమిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. రకరకాల బ్యాక్టీరియాలు మనిషి శరీరంలోకి చొచ్చుకెళ్తాయి. దీనివల్ల మెదడుతో పాటు నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. సరైన సమయంలో ట్రీట్మెంట్తీసుకోకుంటే మరణాలు సంభవిస్తాయని చెబుతున్నారు. కోతి కరిచిన వెంటనే సబ్బుతో శుభ్రంగా కడిగి హాస్పిటల్కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.
2022 సర్వే ప్రకారం..
యాదాద్రి జిల్లాలో 2022లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోతుల గురించి సర్వే నిర్వహించింది. జిల్లాలోని 17 మండలాల్లో 3773 కోతుల గుంపులు ఉన్నాయి. ఒక్కో గుంపులో 30కి తక్కువ కాకుండా వందల సంఖ్యలో కోతులు ఉంటాయని వారి అంచనా. సర్వే ప్రకారం జిల్లాలో 5,17,578 కోతులు ఉన్నాయని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ చేసింది. జిల్లా జనాభాలో 60 శాతానికి మించి కోతులున్నాయని ఆ సర్వేతో తెలుస్తోంది. అయితే రాజాపేట, గుండాల మండలాల్లో జనాభాను మించి కోతుల సంఖ్య ఉందని ఆనాటి సర్వేలో తేలింది.
ఒక వ్యక్తి చేతిలో సంచితో రోడ్డు వెంట నడుస్తూ ఉన్నాడు. దూరంగా ఉన్న కోతి.. ఒక్క ఉదుటున అతడి వద్దకు వచ్చి చేతిలో సంచిని లాగబోయింది. చేయి ఎత్తి దూరంగా తరమబోయాడు. కొట్టబోతున్నాడని చేతిని కరిచేసింది. సంచిని వదిలి అక్కడి నుంచి సదరు వ్యక్తి పారిపోయాడు. యాదాద్రి జిల్లాలో ఇది ఏఒక్క చోటుకో పరిమితం కాదు. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. యాదాద్రి జిల్లాలో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. ఇండ్లల్లోకి చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నాయి.
ఇక ఎక్కడి నుంచైనా కొత్త కోతి వచ్చిందంటే చాలూ వాటి ప్రవర్తనలో విపరీతమైన మార్పు వస్తుంది. ఆ కొత్త కోతిని తరిమికొట్టే వరకూ అవి చేసే అల్లరి మామూలుగా ఉండదు. వాటిలో అవే పరస్పరం దాడులు చేసుకుంటూ మనుషులపైకి దాడికి దిగుతున్నాయి. దీంతో వాటిని చూస్తే చాలు జనాల్లో భయం పెరిగిపోయింది.
యాదాద్రిలో ఈ ఏడాదిలో కోతుల దాడిలో గాయాలకు గురైన వారి సంఖ్య
జనవరి-300
ఫిబ్రవరి-423
మార్చి- 473
ఏప్రిల్- 519
మే- 551
జూన్- 471
జూలై- 610
ఆగస్టు-597
సెప్టెంబర్-636
అక్టోబర్-403
