హైదరాబాద్: హైడ్రా.. హైదరాబాద్ లో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టించే సంస్థ. చెరువులు, నాలాలు, కుంటలు తదిత ప్రభుత్వ స్థలాల రక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా.. ఎన్ని విమర్శలు ఎదురైనా తనపని తాను చేసుకుంటూ వెళ్తోంది. కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడుతుండటంతో హైడ్రాకు హైదరాబాద్ నగర వాసుల మద్ధతు రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా హైడ్రా అరుదైన సత్కారాన్ని అందుకుంది. హైదరాబాద్ మణికొండ వాసులు హైడ్రాకు అభినందన సభ ఏర్పాటు చేసి హైడ్రాకు ఫుల్ సపోర్ట్ చేయడం విశేషం.
మణికొండ మునిసిపాలిటీలో ఐదు వందల కోట్ల విలువైన భూమిని కాపాడటంతో హైడ్రా అభినందన సభ ఏర్పాటు చేశారు కాలనీ వాసులు. మణికొండలోని మర్రిచెట్టు దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు స్థానికులు.
భూమి ధరలు ఆకాశాన్నంటుతున్న మణికొండ మున్సిపాలిటీలో దశాబ్దాలుగా కబ్జాల చెరలో చిక్కుకున్న ప్రభుత్వ భూమితో పాటు పార్కులకు హైడ్రా విముక్తి కల్పించింది. దాదాపు రూ. 500 కోట్ల విలువైన భూమిని సేవ్ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు మణికొండలోని 32 కాలనీల అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
