సౌరవిప్లవం వంద శాతం సోలార్ వినియోగం దిశగా అడుగులు

సౌరవిప్లవం వంద శాతం సోలార్ వినియోగం దిశగా అడుగులు
  • మానుకోటలో అత్యధికంగా 22 సోలార్​​మోడల్​ గ్రామాల ఎంపిక
  • గ్రామసభల నిర్వహణతో ప్రజలకు విస్తృతంగా అవగాహన

మహబూబాబాద్, వెలుగు: విద్యుత్​ వినియోగంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగంపై అడుగులు ముందుకు పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఎంపికైన గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేసి పీఎంసూర్యఘర్​ముఫ్త్​​ బిజిలియోజన–మోడల్​ సోలార్​ విలేజ్​ స్కీమ్​పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అత్యధికంగా మహబూబాబాద్​జిల్లాలో 22 సోలార్​ మోడల్​ గ్రామాలను అధికారులు ఎంపిక చేశారు. 

జిల్లాల వారీగా ఎంపికైన గ్రామాలు..

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో ఐదు గ్రామాలను ఎంపిక చేయగా, అందులో కాటారం, చెల్పూర్, తాడిచర్ల, గణపురం, మహదేవపూర్​ గ్రామాలు ఉన్నాయి. ​ములుగు జిల్లాలో ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, చల్వాయి, పసర, ఏటూరునాగారం, కమలాపురం, వెంకటాపురం గ్రామాలు, జనగామ జిల్లాలో జఫర్​ఘడ్​ను అధికారులు ఎంపిక చేశారు. 

అత్యధికంగా మానుకోటలో..

మహబూబాబాద్​జిల్లాలో బయ్యారం మండల కేంద్రం, దాట్ల, పెద్దముప్పారం, మన్నెగూడెం, గొల్లచర్ల, గార్ల, ముల్కనూర్, గూడూరు, చిన్నముప్పారం, ఇనుగుర్తి, పెనుగొండ గుండ్రాతి మడుగు, కురవి, నేరడ, రాజోలు, మల్యాల, ఎల్లంపేట, నరసింహులపేట, పెద్దనాగారం, నెల్లికుదురు, అమ్మాపురం, హరిపిరాల గ్రామాలను మొత్తంగా 22 జీపీలను ఎంపిక చేశారు. టీజీ రెడ్కో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అనుమానాలు నివృత్తి.. 

గ్రామసభల నిర్వహణతో క్షేత్రస్థాయిలో టెక్నికల్​ సమస్యలు, సబ్సిడీ వివరాలు, కోతుల బెడద నుంచి నివారణ చర్యలు, ఏడాదిలో 300 రోజుల వరకు సోలార్​ పవర్​ను వినియోగించుకోవడం ఎలా, ఇప్పటికే ఎక్కువగా పవర్​ బిల్లులు చెల్లించే వారికి ఎలా ఉపశమనం కలుగుతుంది అనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. కిలో వాట్​కు సబ్సిడీ రూ.30 వేలు, 2కిలో వాట్స్ వరకు రూ.60 వేల సబ్సిడీ, 3కిలో వాట్స్​వరకు సబ్సిడీ రూ.78 వేల వరకు అందించనున్నారు.

బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం.. 

సోలార్​ పవర్​ ప్యానెల్స్​ బిగించుకునే ఇంటి యజమానికి బ్యాంకుల ద్వారా ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల వరకు రుణం మంజూరు చేయనున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. ఒక్కసారి బిగించిన సోలార్​ ప్యానెల్​ 25 ఏండ్ల వరకు సురక్షితంగా ఉండనుంది. సోలార్​ ప్యానెల్స్​ బిగించిన తర్వాత 5 ఏండ్ల వరకు గ్యారంటీని ఆయా కంపెనీల ద్వారా అందించనున్నారు.

ఆన్​ లైన్​లో అప్లై..

పీఎంసూర్యఘర్​ముఫ్త్​​ బిజిలియోజన-మోడల్​ సోలార్​ విలేజ్​ స్కీమ్​కోసం www.pmsuryaghar.gov.in వెబ్ సైట్​లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ మెయిల్, విద్యుత్తు కనెక్షన్, ఫోన్​నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయాలి. సర్వీసు, మొబైల్ నంబర్​తో లాగిన్ అయి దరఖాస్తు చేయాలి. ఇప్పటికే విద్యుత్తు వినియోగానికి సంబంధించిన వివరాలు పొందుపరచాలి. టీజీ రెడ్కో, డిస్కమ్ అధికారులు, ఎంపిక చేసిన సౌరపలకల కంపెనీ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. 

నిర్ణీత రుసుం చెల్లిస్తే సోలార్ పలకలు, ప్యానెల్ బోర్డులు బిగిస్తారు. ట్రాన్స్​కో ద్వారానే మీటరు అమర్చుతారు. ఈ ప్రక్రియ పూర్తయితే సబ్సిడీ ఫండ్​ నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేస్తారు. వినియోగానికి మించి కరెంటు ఉత్పత్తి జరిగితే ఆరు నెలలకోసారి లెక్కించి యూనిట్ కు రూ.3.10 చొప్పున లబ్ధిదారులకు చెల్లిస్తారు.

గ్రామసభల ద్వారా అవగాహన..

సోలార్​ పవర్​వినియోగం పై కొంత మేర  అవగాహన ఉన్నప్పటికీ 5 వేల కంటే ఎక్కువగా జనాభా ఉన్న గ్రామాలను ఎంపిక చేసి స్లాబ్​ఉన్న ప్రతీ కుటుంబ సభ్యులు సోలార్​ పవర్​ వినియోగించుకునే దిశగా ప్రచారం కల్పిస్తున్నాం. ఇప్పటికే మానుకోట జిల్లాలో 5 గ్రామాల్లో గ్రామ సభలను పూర్తి చేశాం. కరపత్రాలు, ఫ్లెక్సీల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం. టెక్నికల్​ సిబ్బంది సహయంతో ప్రజల అనుమానాలు నివృత్తి చేస్తున్నాం.    - రాజేందర్​ , రెడ్కో సంస్థ జిల్లా మేనేజర్​, మహబూబాబాద్​