ఇందూర్కు మాస్టర్ ప్లాన్‌.. గవర్నమెంట్ చెంతకు ఫైనల్ ప్రపోజల్

ఇందూర్కు మాస్టర్ ప్లాన్‌..  గవర్నమెంట్ చెంతకు ఫైనల్ ప్రపోజల్
  • బోధన్‌, ఆర్మూర్‌లో డ్రాఫ్ట్ రూపకల్పన
  • 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక
  • జనాభా తక్కువగా ఉండడంతో ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోని భీంగల్‌  

నిజామాబాద్‌, వెలుగు:జిల్లాలోని మున్సిపాలిటీలకు మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసేందుకు యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ప్రతి ఏడాది పట్టణాలు విస్తరిస్తుండడంతో, వచ్చే 20 ఏళ్లపాటు మౌలిక వసతులు సరిపడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 3.5 లక్షల జనాభా ఉన్న నిజామాబాద్​ కార్పొరేషన్​  మాస్టర్‌ ప్లాన్​ను తుది అనుమతికి ప్రభుత్వానికి పంపారు. 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న బోధన్‌, ఆర్మూర్‌ పట్టణాలను అమృత్‌ 2.0 కింద చేర్చి డ్రోన్‌ సర్వే పూర్తి చేశారు. తుది నివేదిక సమర్పించేందుకు అధికారులు, సంబంధిత విభాగాలకు కలెక్టర్‌ పది రోజుల సమయం ఇచ్చారు. భీంగల్‌ మున్సిపాలిటీ జనాభా 50 వేలలోపు ఉండడంతో, ప్రస్తుతం మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చలేదని అధికారులు తెలిపారు. 

విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా.. 

1937లో ఏర్పడిన నిజామాబాద్‌ ప్రస్తుతం సుమారు 3.5 లక్షల జనాభాతో కార్పొరేషన్‌ హోదాలో కొనసాగుతోంది. 40 చదరపు కిలోమీటర్ల పరిధి దాదాపు రెండింతలు పెరిగింది. ప్రతి ఏడాది కొత్త నివాస కాలనీలు, హోటళ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వాణిజ్య భవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. నగర శివార్లలోని సాగు భూములు కమర్షియల్‌ ప్రాంతాలుగా మారుతుండగా, ప్రతి నెలా దాదాపు రెండు వేల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. అన్ని దిశల్లో ప్రజల రాకపోకలు పెరుగుతుండటంతో నగర స్వరూపం గజిబిజిగా మారకుండా మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అమృత్‌ 1.0 స్కీమ్‌ కింద నగరంలో నీటి సదుపాయాల అభివృద్ధికి రూ.390 కోట్లు మంజూరయ్యాయి. 

ఈ క్రమంలో ఇందూర్‌ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ఫైనల్‌ డ్రాఫ్ట్‌ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇదే తరహాలో, 50 వేల నుంచి లక్ష లోపు జనాభా కలిగిన బోధన్‌, ఆర్మూర్‌ మున్సిపాలిటీలను అమృత్‌ 2.0 స్కీమ్‌లో మాస్టర్‌ ప్లాన్‌ పరిధిలోకి తీసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో సర్వే ఆఫ్‌ ఇండియా నుంచి ఎనిమిది మంది అధికారులు aవచ్చి డ్రోన్‌ కెమెరాలతో మ్యాపింగ్‌ నిర్వహించారు. తుది డ్రాఫ్ట్‌ రూపకల్పనకు అక్టోబర్‌ 28న కలెక్టర్‌ పది రోజుల గడువుతో ఆదేశాలు జారీ చేయడంతో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఆ పనిలో  నిమగ్నమయ్యారు. 

శాఖల వారీగా ప్లాన్‌ సేకరణ 

వచ్చే 20 ఏళ్లపాటు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, ఆర్టీసీ, రైల్వే, ట్రాన్స్​పోర్ట్‌, పోలీస్‌, టూరిజం, ట్రాన్స్​కో, విద్యా, వైద్యం, వ్యవసాయ శాఖలతో సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు. అలాగే రెవెన్యూ, పబ్లిక్‌ హెల్త్‌, మున్సిపాలిటీ, ఇండస్ట్రీస్‌, మైన్స్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ వంటి శాఖలను కూడా భాగస్వాములను చేశారు. గడువు ప్రకారం ఈ నెల 8లోపు మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‌ పూర్తయ్యేలా కలెక్టర్‌ రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. డ్రాఫ్ట్‌ సిద్ధమైన అనంతరం ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిశీలించిన తర్వాత తుది డ్రాఫ్ట్‌ను ప్రభుత్వానికి పంపనున్నారు. 

బోధన్‌కు రోడ్లు అవసరం

లోకల్‌ ఫండ్‌ ఆఫీస్‌గా ఉన్న బోధన్‌ 1956లో మున్సిపాలిటీగా ఏర్పడి, నాలుగో గ్రేడ్‌ నుంచి మొదటి గ్రేడ్‌ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయింది. 21.36 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న ఈ బల్దియా గత 15 ఏళ్లలో అన్ని దిశల్లో విస్తరించినా, పట్టణంలోకి ప్రవేశించే ప్రధాన రోడ్డు మాత్రం ఇప్పటికీ ఒక్కటే ఉండటంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమైంది. శివారు కాలనీలకు డ్రైనేజీ సదుపాయం లేకపోవడం, తాగునీరు, వీధి దీపాల కొరత ఉండడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్ల సంఖ్యను పెంచడం, పార్కులను అభివృద్ధి చేయడం అత్యవసరంగా మారిందని అధికారులు చెబుతున్నారు. రైల్వే సేవల విస్తరణను కూడా మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చుతున్నారు. ప్రజలందరూ ఆమోదించే విధంగా బోధన్‌ మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన జరుగుతోంది.

ఆర్మూర్‌ విస్తరణ పెంపు

ఆర్మూర్‌ వాసుల చిరకాల కోరిక నెరవేరుతూ 2006లో మున్సిపాలిటీగా ఏర్పడింది. అక్కడి ప్రజల్లో రాజకీయ చైతన్యం అధికంగా ఉండటంతో అభివృద్ధిపై ఆసక్తి కూడా ఎక్కువగా కనిపిస్తోంది. 44వ నేషనల్‌ హైవేకు సమీపంలో ఉన్న ఈ పట్టణ విస్తీర్ణం ప్రస్తుతం 26 చదరపు కిలోమీటర్లు దాటింది. పెర్కిట్‌, మామిడిపల్లి, అర్గుల్‌, చేపూర్‌, శ్రీరాంపూర్‌ ప్రాంతాల వరకు అర్బన్‌ ఏరియా విస్తరించింది. 

అయితే టౌన్‌లోకి ప్రవేశించే ప్రధాన రహదారి ఇప్పటికీ ఒక్కటే ఉండటంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. పట్టణ విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతులు అందకపోవడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పరిశ్రమలు, కమర్షియల్‌ షాపింగ్‌ మాల్స్‌ వంటి అంశాలతో ప్రజల అభీష్టానికి అనుగుణంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన జరుగుతోంది. ప్రస్తుత విస్తరణ కంటే రెండింతల మేరకు టౌన్‌ విస్తీర్ణం పెరగనున్నట్లు అధికారులు తెలిపారు.

మల్టిపుల్‌ ఫలితాలు ఉంటాయి.. 

మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‌ రూపొందించే ప్రక్రియలో బిజీగా ఉన్నాం. స్కూళ్లు, ఆసుపత్రులు, పరిశ్రమలు, రైల్వే, షాపింగ్‌,  కమర్షియల్‌ ప్రాంతాలను వేర్వేరు జోన్లుగా విభజించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ప్రతి భవనం ఎస్‌ఎఫ్‌టీ ఏరియా స్పష్టంగా తెలిసేలా ప్లాన్‌ రూపొందిస్తాం. దీంతో ట్యాక్స్‌ వసూలు సులభతరం అవుతుంది. ఒక్క ప్రణాళికతో అనేక విధాలుగా ప్రయోజనాలు లభించనున్నాయి.​ -రాజు, కమిషనర్​, ఆర్మూర్​