పంచ పరివర్తనతో ప్రజల్లోకి ఆరెస్సెస్.. మూడు రాష్ట్రాల క్షేత్ర ప్రచారక్ శ్రీ రామ్ భరత్ కుమార్

పంచ పరివర్తనతో ప్రజల్లోకి ఆరెస్సెస్.. మూడు రాష్ట్రాల క్షేత్ర ప్రచారక్  శ్రీ రామ్ భరత్ కుమార్
  • నిర్మల్ లో భారీ పథ సంచలన్ ర్యాలీ
  • హాజరైన ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే మహేశ్వరెడ్డి

నిర్మల్, వెలుగు: పంచ పరివర్తన విధానంతో మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆరెస్సెస్ విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల క్షేత్ర ప్రచారక్ శ్రీరామ్ భరత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆరెస్సెస్ ఆధ్వర్యంలో నిర్మల్​పట్టణంలో భారీ పథ సంచలన్ ర్యాలీ నిర్వహించారు.

ఎంపీ నగేశ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్, నేతలతోపాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తల నినాదాలతో వీధులన్నీ మారుమోగాయి. ర్యాలీ అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీరామ్ భరత్ కుమార్  మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణతో పాటు కుటుంబ వ్యవస్థను కాపాడడం, సంస్కృతిని పరిరక్షించుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేస్తామన్నారు. 

ఇందుకు కార్యకర్తలంతా కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇకనుండి ప్రతి ఊరిలో, ప్రతి వీధిలో ఆరెస్సెస్ శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమాజాన్ని సంఘటితం చేయడమే ఆరెస్సెస్ ప్రధాన ధ్యేయమన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐజీపీ ఎంకే సింగ్, ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ చిటికేసి శ్రీనివాస్, నగర  సంఘ చాలక్ డాక్టర్ తుమ్మల ప్రమోద్ చంద్రారెడ్డి, సహ సంఘ చాలక్ సాధు కృష్ణదాస్, సంఘచాలక్ నూకల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.