ఓల్డ్‌సిటీ/హైదరాబాద్, వెలుగు: భారత్ ఎవరికీ గులాం కాదని, మనం ఏ వస్తువు కొనాలి, ఏది కొనకూడదో శాసించడానికి అమెరికా ఎవరని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్ తలబ్ కట్టా క్యూబా మసీదులో నిర్వహించిన యౌముల్ ఖురాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమెరికా ఆంక్షలు భారత్‌ను శాసించడాన్ని తప్పుబట్టిన ఒవైసీ.. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలన్నారు.
అమెరికా ఒత్తిడిని తిప్పికొట్టాల్సిన ప్రధాని మోదీ.. మౌనం వహించడం ఏ రకమైన దేశ భక్తి అని ప్రశ్నించారు. మరోవైపు, భారత సరిహద్దు జలాల్లో ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి సంఘటనపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ మౌనంగా ఉండటం రాజ్యాంగ బాధ్యతల ఉల్లంఘన అవుతుందన్నారు.
