- డ్రోన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ మ్యాపింగ్
- వచ్చే 20ఏండ్లకు సరిపడేలా ప్లానింగ్
- జీఎస్ఐ ఆధారిత మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలి
- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం మున్సిపల్‌కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో తొలి అడుగు పడింది. మున్సిపాలిటీ నుంచి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత అమృత్ స్కీం 2.0లో భాగంగా ఎట్టకేలకు మాస్టర్ ప్లాన్‌ను రూపకల్పనకు ఆఫీసర్లు శ్రీకారం చుట్టారు. దాదాపు 50 ఏండ్ల తర్వాత కొత్తగూడెంకు మాస్టర్ ప్లాన్ తయారవుతోంది. వచ్చే 20 ఏండ్లకు సరిపోయేలా ఈ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. డ్రోన్ టెక్నాలజీతో డిజిటల్ మ్యాపింగ్ చేయనున్నారు.
లక్షకు చేరిన కొత్తగూడెం జనాభా..
కొత్తగూడెం మున్సిపాలిటీలో 50 ఏండ్ల కిందట మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అదే ప్లాన్ ఇప్పటి వరకు కొనసాగుతోంది. కొత్తగూడెం జనాభా లక్షకు చేరింది. పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండలంలోని సుజాతనగర్, నర్సింహ సాగర్, కొమిటిపల్లి, నిమ్మలగూడెం, లక్ష్మీదేవిపల్లి, మంగపేట, నాయకులగూడెం గ్రామపంచాయతీలను కలుపుతూ 85.22చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఏప్రిల్ లో గెజిట్ రిలీజ్ చేసింది. ఈ క్రమంలో అమృత్ 2.0 స్కీంలో మాస్టర్ ప్లాన్ రూపొందించే పనికి ఆఫీసర్లు శ్రీకారం చుట్టారు.
డిజిటల్ మ్యాపింగ్..
కొత్తగూడెం కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్‌ను అధునాతన పద్ధతిలో నిర్వహించనున్నారు. గతంలో కొత్తగూడెం మున్సిపాలిటీలో డ్రోన్లతో మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. ఇప్పుడు కొత్తగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొప్పొరేషన్ కు మాస్టర్ ప్లాన్‌ను డ్రోన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ మ్యాపింగ్ చేయనున్నారు. జీఎస్ఐ ఆధారితంగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించేలా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. వచ్చే 20 ఏండ్లకు అవసరమయ్యేలా భవిష్యత్ నగరాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలను రూపొందించనున్నారు.
ప్లాన్ పక్కాగా నిర్వహిస్తేనే..
కొత్తగూడెం, పాల్వంచతో పాటు కార్పొరేషన్లో కలిసిన సుజాతనగర్‌లోని ఏడు గ్రామపంచాయతీలపై సమగ్రంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉందని నగర వాసులు పేర్కొంటున్నారు. మాస్టర్ ప్లాన్ లేక ఇప్పటికే కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ఆక్రమణలకు గురయ్యాయి. కొత్తగూడెంలోని పెద్ద బజార్, చిన్న బజార్, లేపాక్షి హోటల్ రోడ్, ఎంజీ రోడ్లలో పలు గల్లీలు కబ్జా అయ్యాయి. ఈ మాస్టర్ ప్లాన్‌లో అన్ని అంశాలను తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.
అవగాహన కార్యక్రమం..
అమృత్ 2.0 స్కీంలో భాగంగా జీఎస్ఐ ఆధారిత మాస్టర్ ప్లాన్‌ను పక్కాగా రూపకల్పన చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో డీటీసీపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ అశ్విని ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై నిర్వహించిన అవగాహన ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. సమగ్ర సమాచారం ఆధారంగా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలన్నారు. భవిష్యత్‌కు ఉపయోగపడేలా మాస్టర్ ప్లాన్ ఉండాలని ఆఫీసర్లను ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన ప్రక్రియను ఆర్డీఓలు తహసీల్దార్లు పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. మాస్టర్ రూప కల్పనపై స్పెషల్ మీటింగ్స్‌ను నిర్వహించనున్నట్టు చెప్పారు.
