న్యాయమూర్తుల బదిలీల్లో పారదర్శకత అవసరమే!

న్యాయమూర్తుల బదిలీల్లో  పారదర్శకత అవసరమే!

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1973 వరకు భారత ప్రధాన న్యాయమూర్తిని భారత రాష్ట్రపతి నియమించేవారు. మిగతా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి రాష్ట్రపతి నియమించేవారు.  1973 వరకు ప్రభుత్వానికి, భారత ప్రధాన న్యాయమూర్తికి మధ్య నియామకాల్లో ఏకాభిప్రాయం ఉండేది. 

సీనియర్​ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని  ప్రధాన న్యాయమూర్తిగా నియమించడమనేది సంప్రదాయం గా ఉండేది. ఈ సంప్రదాయాన్ని 1973లో ప్రభుత్వం పాటించకుండా, ముగ్గురు సీనియర్​ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కాదని ఏఎన్​రేని భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది. అదేవిధంగా 1977లో కూడా సీనియర్లను కాదని వేరే న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. దీనివల్ల కార్య నిర్వాహక వ్యవస్థకి, న్యాయవ్యవస్థకి మధ్య పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. 

మొదటి జడ్జెస్​ కేసు 1982

1982లో ఈ విషయం గురించి సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. అది ఎస్​పి గుప్తా లేదా మొదటి జడ్జెస్​ కేసుగా ప్రాచుర్యం పొందింది. రాజ్యాంగంలో ఆర్టికల్​ 124లో ఉన్న ‘సంప్రదింపులు’ అన్న పదం ‘సమ్మతి’ కాదని,  సంప్రదింపుల ఆధారంగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తులను వాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా ఇతర హైకోర్టులకు బదిలీ చేయవచ్చని కూడా సుప్రీంకోర్టు చెప్పింది.

రెండవ జడ్జెస్​ కేసు 1993

సుప్రీంకోర్టు న్యాయవాదులు (అడ్వకేట్స్​ ఆన్​రికార్డు) 1993లో మరో పిటీషన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు గతంలో తాను ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ‘సంప్రదింపుల’ అర్థాన్ని ‘సమ్మతి’గా మార్చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీని ఫలితంగా కొలీజియం వ్యవస్థ ఆవిర్భవించింది. 

మూడో న్యాయమూర్తుల కేసు 1998

రాజ్యాంగంలోని 124, 217, 222 ఆర్టికల్స్​లో చెప్పిన ‘సంప్రదింపులు’ (కన్సల్టేషన్) అనే పదాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రపతి సుప్రీంకోర్టుని రెఫరెన్స్​ ద్వారా అడిగారు. ఈ సంప్రదింపుల ప్రక్రియలో ప్రధాన న్యాయమూర్తి ఒక్కరే కాదు నలుగురు సీనియర్​ న్యాయమూర్తులు ఉంటారని, ఆ నలుగురిలో  ఇద్దరు వ్యతిరేకించినా ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వానికి సిఫారసు చేయరు. 

ఈ మూడో న్యాయమూర్తుల కేసు ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో ఇద్దరు న్యాయమూర్తులు, వారి బదిలీల విషయంలో నలుగురు న్యాయమూర్తులు, వారితోపాటు  ఆ సంబంధిత హైకోర్టులో సంబంధం ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పాల్గొని నిర్ణయం తీసుకుంటారు. ఈ తీర్పుద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల విషయంలో కఠినమైన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు నిర్దేశించింది. దీన్నే కొలీజియం వ్యవస్థ అంటారు. 

కొలీజియం వ్యవస్థ

న్యాయమూర్తుల నియామకంలో ఈ కొలీజియం ప్రధాన పాత్ర పోషిస్తుంది. న్యాయమూర్తుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆ సిపారసులను ఆమోదించవచ్చు. లేదా కొలీజియం ప్రతిపాదనలను  ప్రభుత్వం తిరిగి సుప్రీంకోర్టుకి పంపించవచ్చు.  కొలీజియం మళ్లీ అదేపేరును తిరిగి పంపితే ప్రభుత్వం ఆ పేర్లను ఆమోదించాల్సి ఉంటుంది. పారదర్శకత, జవాబుదారీతనం లేకపోవడం వల్ల కొలీజియం మీద విమర్శలు ఉన్నాయి.  

ప్రభుత్వం కూడా ఆ సిఫారసులలో కొన్నింటిని ఆమోదిస్తుంది.  మరి  కొన్నింటిని నిలిపివేస్తుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏమీ చేయలేకపోతుంది. ఆ తరువాత ప్రభుత్వం జాతీయ న్యాయ నియామక కమిషన్​ చట్టం, 2014ని,  99వ  రాజ్యాంగ సవరణ ద్వారా  ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతకి భంగం కలిగిస్తుందని, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించి  ఆ చట్టాన్ని కొట్టివేసింది. 

కొలీజియంలో పారదర్శకత కరువు

కొలీజియంలో పారదర్శకత తక్కువన్న విమర్శలు న్యాయవాదుల నుంచే కాదు ప్రజల నుంచి కూడా వస్తున్నాయి. న్యాయవ్యవస్థలో సామాజిక వైవిధ్యాన్ని కోరుతున్నవారు,  కార్యనిర్వాహక జోక్యం గురించి ఆందోళన చెందుతున్నవారు ఈ అపారదర్శకతని విమర్శిస్తున్నారు. జాతీయ న్యాయ నియామక కమిషన్​ చట్టాన్ని కొట్టివేసిన తరువాత కొలీజియం వ్యవస్థను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పింది.  

రెండు సంవత్సరాల తరువాత అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్​ మిశ్రా కొలీజియంకి అధ్యక్షత వహించినప్పుడు ఈ కొలీజియం నిర్ణయాలను, తీర్మానాలను ప్రజలకు తెలిసేవిధంగా విడుదల చేయడం ప్రారంభించారు. గోప్యతను పాటిస్తూ పారదర్శకతను పెంచేవిధంగా సుప్రీంకోర్టు వెబ్​సైట్​లో  కొలీజియం తీర్మానాలను ప్రచురించాలని అక్టోబర్ 7, 2017 న  ప్రకటించడం ద్వారా దాన్ని ధ్రువీకరించినట్టు అయింది. న్యాయమూర్తులను నియమించేముందు తీర్మానాలను ప్రకటించారు. కానీ, అవి చాలావరకు స్పష్టంగా లేకుండా ఉన్నాయి. ఈ చిన్న ప్రయత్నం కూడా ఎక్కువకాలం కొనసాగలేదు. 

కొలీజియం సిఫారసులు

భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్​ గొగోయ్​ కాలంలో  ఈ కొలీజియం తీర్మానాలు చాలా సంక్షిప్తంగా ఉండేవి.  ఆ తరువాత అక్టోబర్​ 15, 2019న న్యాయమూర్తుల పదోన్నతి, బదిలీల నియామకాలకు సంబంధించి ఏడు తీర్మానాలను ప్రచురించారు.  వీటిలో  ఏ కారణాలను చూపించలేదు. ఈ ధోరణి ఎస్​ఎ బొబ్డె,  జస్టిస్​ ఎన్​వి రమణ కాలంలో కూడా కొనసాగింది. ఆగస్టు 17, 2021 నాడు 9మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలను సిఫారసు చేస్తూ  సుప్రీంకోర్టు  కొలీజియం సిఫారసు చేసింది.

 అంతకుముందు  రెండు సంవత్సరాలుగా కొలీజియం సమావేశం జరగలేదు.  కొలీజియం సభ్యుల మధ్య ఉన్న అంతర్గత విభేదాల వల్ల ఈ ప్రతిష్టంభన జరిగిందని అంటారు. కొత్త కొలీజియం ఏర్పాటుతో అకస్మాత్తుగా కొలీజియం కార్యకలాపాలు ఊపందుకున్నాయి. 2017వ సంవత్సరం నుంచి 88 మంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు జరిగాయి. 33 మంది న్యాయమూర్తుల బదిలీల సిఫారసులు సెప్టెంబరు 16, 2021 నాడు అంటే ఒక్కరోజులో జరగడం విశేషం. 1950 నుంచి 1976 సంవత్సరాల మధ్య కాలంలో కేవలం 25 బదిలీలు మాత్రమే జరిగాయి.

1950 నుంచి అత్యధికంగా బదిలీల సిఫారసులు జరిగింది  సెప్టెంబర్​ 16, 2021 నాడు మాత్రమే,   ఈ బదిలీలకు కారణాలను సిఫారసుల్లో పేర్కొనలేదు.  గతంలో  న్యాయవ్యవస్థలో బదిలీలు తక్కువగా జరిగేవి. 1950 నుంచి 1976 వరకు జరిగిన బదిలీలు 25 మాత్రమే.  ఎమర్జెన్సీ కాలంలో 16 మంది బదిలీలు వాళ్ల అనుమతిలేకుండా జరిగాయి. .  

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తుల బదిలీలు ఎక్కువగా జరిగాయని చాలామంది అప్పుడు అన్నారు. 2021లో జరిగిన హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు ఎమర్జెన్సీ బదిలీలను గుర్తు చేశాయి.  అందుకే ఈ బదిలీలు చేయడానికి గల కారణాలు, పారదర్శకతను ప్రజలు కోరుకున్నారు. 

న్యాయమూర్తుల నైతికతకు భంగం

అత్యధిక కేసులున్న మద్రాస్​ హైకోర్టు నుంచి అతి తక్కువ కేసులున్న మేఘాలయ కోర్టుకి ఏదో చిన్న కారణం వల్ల ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ బెనర్జీని  బదిలీ చేశారు. అదేవిధంగా మద్రాస్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తహిల్​రమణిని మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేశారు. తన బదిలీని పున:పరిశీలించాలన్న ఆమె దరఖాస్తును  సుప్రీంకోర్టు తిరస్కరించింది. చివరికి ఆమె రాజీనామా చేసింది. ఇవి వివాదాస్పదమయ్యాయి. ఈ వివాదానికి ప్రతిస్పందనగా సుప్రీంకోర్టు ఒక ప్రకటను విడుదల చేసి మెరుగైన న్యాయ నిర్వహణ కోసం ఈ బదిలీలను సిఫారసు చేసినట్టు చెప్పింది. 

 ఏ బదిలీనైనా ఎందుకోసం జరిగాయో తెలియాలంటే బదిలీలకు గల కారణాలను ప్రచురిస్తే తెలుస్తుంది. అవి ప్రచురిస్తే ఆ న్యాయమూర్తుల నైతిక బలం దెబ్బతింటుందన్న మాట కూడా ఉంది.   అప్పటి డిల్లీ  హైకోర్టు న్యాయమూర్తి మురళీధర్​ని  బదిలీ చేయమని కొలీజియం ఫిబ్రవరి 12, 2020న సిఫారసు చేసింది. అయితే, ఆయన బదిలీ మాత్రం వెంటనే జరగలేదు. 

ఢిల్లీలో అల్లర్లు జరిగిన విషయం గురించి, పోలీసుల వైఫల్యం గురించి సొలిసిటర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా తుషార్​ మిశ్రాని ఆ న్యాయమూర్తి గ్రిల్​ చేసిన తరువాత ఆ అర్ధరాత్రి బదిలీ చేశారు. సాధారణంగా న్యాయమూర్తుల జాయినింగ్​ ఇచ్చే సమయాన్ని కూడా న్యాయమూర్తి మురళీధర్​కి ఇవ్వలేదు.  

బదిలీలకు కారణాలు తెలపాలి

కొంతమంది న్యాయమూర్తులను గత రెండు సంవత్సరాల క్రితం బదిలీలు చేసి వేరే రాష్ట్రాలకు పంపించారు. ఇప్పుడు తిరిగి వారిని  గతంలో ఉన్న రాష్ట్రాలకు బదిలీ చేయమని సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ముందుగా ఎందుకు బదిలీ చేశారో  ప్రచురించలేదు.  ఆ తరువాత తిరిగి ఆయా రాష్ట్రాలకి తిరిగి బదిలీ చేయమని ఎందుకు సిఫారసు చేసారో కొలీజియం ప్రకటనలో లేదు. 

కనీసం  మెరుగైన న్యాయ నిర్వహణ కోసం బదిలీ చేస్తున్నట్టుగా కూడా పేర్కొనలేదు. ఈ తిరిగి బదిలీల వల్ల ప్రభుత్వ ఖజానా మీద తీవ్రభారం పడుతుంది. ఇలాంటి బదిలీలలో కారణాలు తెలుసుకోవాలని న్యాయవ్యవస్థతో సంబంధంవున్న వ్యక్తులు, ప్రజలు ఆశించడంలో తప్పులేదు. నిజానికి న్యాయం ఉంది. 

బదిలీల కారణాలను న్యాయమూర్తులకైనా తెలపాలి

బదిలీల వల్ల న్యాయమూర్తుల సీనియారిటీ ఆర్డర్​ మారుతుంది. బదిలీ అయిన న్యాయమూర్తికి తెలియని కోర్టు సంప్రదాయాలు, వ్యాజ్యాల పద్ధతులను తెలుసుకోవాల్సి ఉంటుంది. కొంత విన్న కేసులను తిరిగి వినాల్సి వస్తుంది.  జిల్లా కోర్టు రికార్డులను అనువదించాల్సి వస్తుంది. అధిక భారంతో ఉన్న కోర్టులు మరింత జాప్యానికి లోనవుతాయి. బదిలీలు ఎంత అవసరమో అంత అనవసరంగా కూడా అనిపిస్తాయి.  

ఏమైనా ప్రభుత్వం తన సౌకర్యం కోసం ఈ బదిలీలను ఉపయోగించుకోకుండా చూడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంది. పక్షపాతం అనేది లేదని చెప్పడానికి,  ప్రజాహితం కోసం మెరుగైన న్యాయ నిర్వహణ కోసం బదిలీలు చేసినప్పుడు ఆ కారణాలను అందరికీ తెలియజేయకపోయినా కనీసం ఆ న్యాయమూర్తులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తిరిగి అదే కోర్టులకు న్యాయమూర్తుల బదిలీ సిఫారసు చేసినప్పుడు ఆ న్యాయమూర్తులకే కాదు న్యాయ సంబంధ వాటాదారులకూ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- డా. మంగారి రాజేందర్, జిల్లా జడ్జి (రిటైర్డ్)-